ఆశల పంట ఆవిరైంది..కన్నీరే మిగిలింది...

ఆశల పంట ఆవిరైంది..కన్నీరే మిగిలింది...
x
Highlights

అయితే అతివృష్టి, కాకుంటే అనావృష్టి ఏదేమైనా అన్నదాత ఆగం కావాల్సిందే నష్టం భరించాల్సిందే. అక్టోబర్‌లో వాయుగుండంతో కోతకొచ్చిన పంట పాడైపోయింది. ఇప్పుడు...

అయితే అతివృష్టి, కాకుంటే అనావృష్టి ఏదేమైనా అన్నదాత ఆగం కావాల్సిందే నష్టం భరించాల్సిందే. అక్టోబర్‌లో వాయుగుండంతో కోతకొచ్చిన పంట పాడైపోయింది. ఇప్పుడు నివర్‌ తుఫాన్‌తో చేతికొచ్చిన పంట నాశనమైంది. రెండురోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు, కంది, చిరుధాన్యాల పంటలు నీట మునిగాయి. తడిసిన పంటలను చూసి రైతులు తల్లఢిల్లుతున్నారు.

అతిభారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నష్టం వాటిల్లింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులు, భారీవర్షాలకు వరి మట్టి పాలవుతోంది. కోతకొచ్చిన ఖరీఫ్‌ పంటతో పాటు మొలక, మొక్క దశల్లో ఉన్న రబీ పైర్లు దెబ్బతింటున్నాయి. సీమ జిల్లాల్లో గాలులు, వర్షాలకు బత్తాయి, బొప్పాయి, చీనీ, టమోట, ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి.

గతనెలలో వాయుగుండంతో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి, అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు జిల్లాలో పత్తి పంటకు భారీనష్టం వాటిల్లింది. ఆ రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించక ముందే నివర్‌ తుఫాను రైతులను మరోసారి ముంచింది. గుంటూరు జిల్లాలో సుమారు 36వేల ఎకరాల్లో వరి కోతలు కోసి ఓదెలన్నీ చేలపైనే ఉండటంతో అవన్నీ వాన నీటిలో తేలియాడుతున్నాయి. సాగర్‌ అయకట్టు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కోత దశలో ఉన్న పత్తి తడిసి ముద్దవుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో 3,197 హెక్టార్లలో, కృష్ణాజిల్లాలో 27,500 హెక్టార్లలో పంట నీటమునిగిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కడప జిల్లాలో 168 గ్రామాల్లో 4,885.5 హెక్టార్ల లో పంటలు దెబ్బతిన్నాయి. ఏదేమైనా రైతులపై ప్రకృతి పగపడుతూనే ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. ప్రకృతి విలయతాండవంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories