Cyclone Jawad: దూసుకొస్తున్న జొవాద్ తుఫాన్.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Jawad Storm to Reach the Andhra Pradesh and Odisha
x

దూసుకొస్తున్న జొవాద్ తుఫాన్ (ఫైల్ ఫోటో)

Highlights

*బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర వైపుగా వస్తున్న జొవాద్ తుపాను *విశాఖకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం

Cyclone Jawad: జొవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 280 కిలోమీటర్లల దూరంలో ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కిలోమీటర్లు, పూరీకి 460 కిలోమీటర్లు, పారాదీప్‌కి 540 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా ఇవాళ ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

తుపాను దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుందని వివరించారు. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు తుపాను కారణంగా 95 రళ్లు రద్దయ్యాయి.

తుపాను కారణంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. అదేవిధంగా ఇవాళ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

మరోవైపు సహాయ చర్యల కోసం NDRF అప్రమత్తమైంది. సహాయక 64 బృందాలు సిద్ధంగా ఉన్నట్లు NDRF డీజీ అతుల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు 46 బృందాలను పంపామని, మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories