Top
logo

శాసన మండలి రద్దుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. లోకేష్‌ బాబు ఫ్యూచరేంటి?

శాసన మండలి రద్దుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. లోకేష్‌ బాబు ఫ్యూచరేంటి?శాసన మండలి రద్దుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం
Highlights

మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే, పెద్దల సభ, ఇక కాలగర్భంలో...

మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే, పెద్దల సభ, ఇక కాలగర్భంలో కలిసిపోతుంది. మరి మండలికి మంగళంతో ఎవరికి నష్టం...ఎవరికి లాభం...? కేవలం టీడీపీకే ఎక్కువ నష్టం వైసీపీకి లేదా? ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ ఆశావహుల పరిస్థితి ఏంటి? గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకుందని తెలుగుదేశం అధిష్టానంపై అదే పార్టీ నాయకులు రగిలిపోతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు ఆమోదించింది శాసన సభ. ఇక త్వరలో దీనికి పార్లమెంట్, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించబోతోంది. మరి శాసన మండలి రద్దుతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, టీడీపీకి నష్టమెంత వైసీపీ లాభమెంత నష్టమెంత అన్న చర్చ జరుగుతోంది.

ఏపీ శాసన మండలిలో చైర్మన్‌ సహా మొత్తం సభ్యుల బలం 58. అందులో టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికులు టీడీపీ సభ్యులే వుండటంతో, మండలిలో టీడీపీదే మెజారిటీ. అయితే, వికేంద్రీకరణ బల్లుకు అడ్డుతగులుతోందని, వైసీపీ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేసింది. అయితే, మండలి రద్దు నిర్ణయంతో ఎక్కువ నష్టం తెలుగుదేశానికే. ఎందుకంటే, టీడీపీకి మొత్తం సభ్యులు 28 మంది. వీరంతా ఇప్పుడు పదవులు కోల్పోయే పరిస్థితి.

గోటితో పోయేది, గొడ్డలి దాకా తెచ్చుకున్న చందంగా టీడీపీ పరిస్థితి మారిందని విశ్లేషకులంటున్నారు. ఎప్పుడైనా శాసన సభదే అంతిమ నిర్ణయమని తెలుసు. కేవలం మూడు నెలలే ఏ నిర్ణయాన్నయినా ఆపలగలమని తెలుసు. అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందమే కానీ, అంతిమం కాదనీ తెలుసు. అయినా మొండిగా ముందుకుపోయింది తెలుగుదేశం. మూడు నెలల్లో ఏదో అయిపోతుందనుకుంటే, ఇంకేదేమో జరిగిపోయింది. ఏకంగా మండలి రద్దు జరిగిపోయింది. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలు లబోదిబోమంటున్నారు. ఉన్న పదవులు కూడా ఊడిపోవడానికి తెలుగుదేశం అధినేత నిర్ణయమే కారణమని రగిలిపోతున్నారట. ఎవరిచ్చిన సలహానో కానీ, చివరికి తమ పదవులు ఊడిపోతున్నాయని బాధపడిపోతున్నారట. లోకేష్‌ పదవి కూడా పోతోంది.

అసెంబ్లీలో ఎలాగూ బలంలేదు కాబట్టి, కనీసం మండలిలోనైనా తమ స్వరం బలంగా వినిపించేందుకు టీడీపీకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయిందని, ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారట. ఎమ్మెల్సీగా ప్రోటోకాల్‌తో పాటు అనేక వసతులు అనుభవించిన నేతలు, రేపు రాష్ట్రపతి ఆమోదం తర్వాత, అవన్నీ కోల్పోతామని ఫీలవుతున్నారట. టీడీపీ మండలి సభ్యుల్లో ఇలాం నైరాశ్యం నెలకొనడంతో, వారిలో ధైర్యంనింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్దరిస్తామని హామినిస్తున్నారట. తిరిగి అధికారంలోకి వస్తామో రామో ఇప్పుడేం చెప్పలేమని, కేవలం ధైర్యంనింపడానికే ఇలాంటి మాటలు చెబుతున్నారని మాట్లాడుకుంటున్నారట టీడీపీ ఎమ్మెల్సీలు. మొత్తానికి మండలి రద్దుతో ఎక్కువ నష్టం టీడీపీకే.

టీడీపీకి ఎక్కువ లాస్‌ స్పష్టంగా కనపడ్తున్నా, వైసీపీకీ ఎంతోకొంత నష్టం జరుగుతోంది. తొమ్మిదిమంది సభ్యులు ప్రాతినిధ్యం కోల్పోతారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు పదవీ గండం వుంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల భవిష్యత్ ఏంటన్నది అర్థంకావడంలేదట. అలాగే, చాలామంది ఎమ్మెల్సీ పదవులపై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఓడిన నేతలు, టికెట్‌ దక్కని వారు కూడా నిరీక్షిస్తున్నారు. జగన్‌ చాలామందికి హామీలు కూడా ఇచ్చారు. అయితే, మండలి రద్దుతో వారందరిలోనూ నైరాశ్యం నెలకొంది.

ఇక బీజేపీకి సైతం ఇద్దరు ఎమ్మెల్సీలు. వీరు కూడా పదవులు కోల్పోతున్నారు. అసెంబ్లీలో ఎలాగూ వీరికి ప్రాతినిధ్యంలేదు. కనీసం మండలిలోనైనా వాయిస్ వినిపించే అవకాశం వుండేది. కౌన్సిల్‌ రద్దుతో చట్టసభల్లో ఇక వారి వాయిస్‌ వినిపించదు. మొత్తానికి మండలి రద్దుతో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకూ నష్టం. అయితే టీడీపీకే ఎక్కువ నష్టం. కానీ మండలి నిర్ణయంతో ప్రభుత్వపరంగా ఇక తమకెలాంటి ఇబ్బందులూ, ఆటంకాలూ ఉండవంటోంది వైసీపీ.

Web TitleCouncil abolition: Whom it going to benefit? What is the future of Lokesh
Next Story

లైవ్ టీవి


Share it