మండలి రద్దుతో ఇద్దరు మంత్రులకు పదవీ గండం.. రెండు మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేస్తారు?

మండలి రద్దుతో ఇద్దరు మంత్రులకు పదవీ గండం.. రెండు మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేస్తారు?
x
మండలి రద్దుతో ఇద్దరు మంత్రులకు పదవీ గండం
Highlights

శాసన మండలి రద్దు 58 మందిలో నిరాశా, నిస్పృహలను నింపింది. కానీ కొందరిలో మాత్రం సరికొత్త ఆశలు మొలకెత్తేలా చేస్తోందట. ముఖ్యంగా వైసీపీలో కొందరు నాయకులు,...

శాసన మండలి రద్దు 58 మందిలో నిరాశా, నిస్పృహలను నింపింది. కానీ కొందరిలో మాత్రం సరికొత్త ఆశలు మొలకెత్తేలా చేస్తోందట. ముఖ్యంగా వైసీపీలో కొందరు నాయకులు, చకచకా పావులు కదుపుతున్నారట. మండలి రద్దుతో నిజంగా వైసీపీలో సంతోషిస్తున్నది ఎవరు? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఖుషీ ఖుషీ అవుతున్న ఆ నేత ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిని రద్దు చేస్తూ, జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్రమంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. కౌన్సిల్ రద్దుతో తెలుగుదేశానికే ఎక్కువ నష్టం జరుగుతున్నా, వైసీపీకీ కొంత నష్టం తప్పడం లేదు. ఇద్దరు మంత్రులకు పదవీగండం తెచ్చిపెడుతోంది మండలి రద్దు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, పశు సంవర్థక శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణల కేబినెట్‌ పోస్టు ప్రమాదంలో పడుతోంది. ఎందుకంటే వీరిద్దరు మండలి నుంచే ప్రాతినిధ‌్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇద్దరి పదవులను ఎవరితో భర్తీ చేస్తారన్నదానిపై మరింత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాసన మండలి రద్దు తీర్మానం ప్రస్తుతం సిక్కోలు జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. గత క్యాబినెట్ విస్తరణలో శ్రీకాకుళం జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. దీంతో సీనియర్ నాయకుడుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మాత్రం ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వచ్చింది. రెండో విడత విస్తరణలో కచ్చితంగా అవకాశం కల్పిస్తామని వైసిపి అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ, ధర్మాన అనుచరుల్లో మాత్రం అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. అయితే, ప్రస్తుతం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి పదవికి మండలి గండం ఉండటంతో, ధర్మాన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా జిల్లా రాజకీయాల్లో వైసిపికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకులు అయినప్పటికీ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్నారనే కారణంతో, ప్రసాదరావును కాదని ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు జగన్. కాగా ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించినప్పటి నుంచీ ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఆయనే మంత్రిగా ప్రచారం చేసుకుంటూ రావడం, వారి ఊహలకు భిన్నంగా అధినేత తీసుకున్న నిర్ణయం ఉండటంతో ధర్మాన అనుచరుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.

జిల్లాలో సీనియర్ నాయకుడు అవ్వటమే కాక మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నా ప్రసాదరావుకు మంత్రి పదవి లభించక పోవడంతో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ధర్మాన అనుచరులు స్థబ్దుగా ఉంటూ వచ్చారు. జిల్లా పార్టీని నడిపించగలిగే వ్యక్తికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ధర్మానకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలకూ కీలకమని ధర్మాన అనుచరులు బహిరంగంగానే చర్చించుకున్నారట. అయితే అదిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, రెండవసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో తప్పక చోటు లభిస్తుందనే హామీ ఉండటంతో అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.

అయితే తాజాగా శాసన మండలి రద్దు నిర్ణయంతో జిల్లాలోని ధర్మాన ప్రసాదరావు అనుచరుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఎన్నికైన వారే. అయితే మండలి రద్దైతే వీరికి క్యాబినెట్ లో మరో ఆరు నెలలు పాటు కొనసాగేందుకు ఢోకా ఉండదు. అయితే ఆరు నెలలలోపు వీరు ఎమ్మెల్యేలు కావాలి, లేనిపక్షంలో క్యాబినెట్‌లో కొనసాగేందుకు సాంకేతిక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఇదే అంశం ధర్మాన అనుచరుల్లో కొత్త ఆశలకు కారణమవుతోందట.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకవేళ శాసన మండలి రద్దుకు ఆమోదం దక్కితే, ఆ సమయంలో ఆరునెలల తర్వాత మంత్రులుగా ఎన్నిక కాబోయే ఆ రెండు స్థానాల్లో, ఒకటి ధర్మానకి దక్కుతుందనే భావనలో ఆయన అనుచరులు ఉన్నారట. అందులో భాగంగా ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానమే ధర్మానకు వరిస్తుందనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోందట. ముఖ్యంగా ధర్మాన కూడా బిసి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, దానితో పాటుగా గతంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించిన రెవిన్యూ శాఖకే సుభాష్ చంద్రబోస్ సైతం మంత్రిగా ఉండడంతో ఆయన స్థానంలోనే ధర్మాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని ధర్మాన అనుచరులు చర్చించుకుంటున్నారట. అంతేకాదు, ఉత్తరాంధ్రకే రాజధాని వస్తుండటంతో, ఈ ప్రాంతం నుంచి మరింత బలమైన నాయకుడు మంత్రివర్గంలో వుంటే, బాగుంటుందన్న ఆలోచనల్లో భాగంగా, ధర్మానకు ఛాన్స్‌ దొరుకుతుందన్న డిస్కషన్‌ సాగుతోంది.

కాగా రెండున్నరేళ్ళ తర్వాత మంత్రివర్గ విస్తరణలో లభిస్తుంది అనుకున్న పదవి ముందుగానే వస్తోందని ధర్మాన అనుచరులు ఏకంగా సంబరాలకు సిద్ధమవుతున్నారట. ఇదిలా ఉంటె, జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి లభిస్తే ఇప్పటికే మంత్రిగా ఉన్న కృష్ణదాస్ పరిస్థితి ఏమిటి..? అదిస్థానం జిల్లాలో ఇద్దరినీ మంత్రులుగా కొనసాగిస్తుందా..? అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో, ఒకరినే వుంచుతుందా? అందులోనూ సీనియర్ నాయకుడు కాబట్టి ప్రసాదరావును మంత్రిగా ఉంచి, కృష్ణదాస్‌కు ఉద్వాసన పలుకుతుందా.? అనే అంశాలు మరో చర్చకు దారితీసున్నాయి. అయితే అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు ఇటువంటి అనవసర ఆర్భాటాల వల్ల అసలుకే మోసమని భావించిన ధర్మాన వర్గీయులు, ఇప్పుడే ఎక్కడా ఏమి చర్చించకూదడనే ఆలోచనలో ఉన్నారట.

ధర్మాన ఒక్కరే కాదు, ఈ రేసులో కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అటు గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ స్థానంలో ఎవరిని తీసుకుంటార్ననదానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఆశావహులైతే చాలామంది వున్నారని, అయితే సామాజిక సమీకరణలు, ప్రాంతాల సమీకరణలతో పాటు సీనియారిటీ, నైపుణ్యం కూడా కీలకమంటున్నారు విశ్లేషకులు. మొత్తమ్మీద శాసన మండలి రద్దు నిర్ణయంతో ఎవరికి ఎలా ఉన్నా మంత్రి పదవి దక్కలేదనే నైరాశ్యంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు వంటి కొంతమంది సీనియర్‌ నేతల్లో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయట. అయితే దీనిపై అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది మాత్రం ఉత్కంఠ కలిగిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories