ఉన్నతాధికారులపై ఓ కానిస్టేబుల్ ఆవేదన?

ఉన్నతాధికారులపై ఓ కానిస్టేబుల్ ఆవేదన?
x
Highlights

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రధాన భూమిక వారిదే. అయినా పైస్థాయి అధికారులకే క్రెడిట్. వారి పేరు అస్సలు వినిపించదు. కరోనా టైంలోనూ వారి సేవల ప్రశంసనీయం....

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రధాన భూమిక వారిదే. అయినా పైస్థాయి అధికారులకే క్రెడిట్. వారి పేరు అస్సలు వినిపించదు. కరోనా టైంలోనూ వారి సేవల ప్రశంసనీయం. అయినా, పైస్థాయి ఆఫీసర్ల ఉదాసీనత వారిపై. సేఫ్‌ జోన్‌లో వున్న పైఅధికారులు మాత్రం, వారంవారం కోవిడ్ టెస్టులు చేయించుకుంటారు. కరోనా డేంజర్‌ ఫీల్డ్‌లో వుండే కానిస్టేబుళ్లు, హోంగార్డులకు మాత్రం పరీక్షలు చేయించరు. దీంతో చాలామంది కరోనా బారినపడుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే తమ పట్ల ఈ వివక్ష ఏంటన్నది వారి ఆవేదన. పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బందికి, కరోనా టెస్టులెందుకు చేయించడం లేదు? దీని వెనక వినిపిస్తున్న చర్చేంటి?

కరోనా వైరస్‌ కష్టకాలంలో పోలీసులు ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో చూస్తూనే వున్నాం. మొదటి లాక్‌డౌన్‌ టైంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని కంట్రోల్ చేశారు. ఇప్పటికీ కర్ఫ్యూలో డ్యూటీ చేస్తున్నారు. వైరస్‌పై ప్రజల్లో అవగాహన తేవడంతో పాటు, శాంతి భద్రతల బాధ్యతలనూ నిర్వర్తించారు. పగలనక, రేయనకా ఆపదలో ఎవరున్నా వారిని క్షేమంగా ఇంటికి చేర్చడం వారి కర్తవ్యం. ఈ మొత్తం పోలీసుల విధుల్లో, చాలా కీలకంగా వ్యవహరించేది కిందిస్థాయి సిబ్బందే. ఇప్పుడు ఆ పోలీసులకే కష్టం వచ్చిపడింది. అందరికీ తామున్నా, మాకు మాత్రం ఎవరూలేరన్న నిర్వేదం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ కారణం, పైస్థాయి అధికారుల తీరేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. రాష్ట్రాలను, జిల్లాలను కలవర పెడుతోంది. ఈ తరుణంలో కనీసం మీకు మేము ఉన్నామనే భరోసా కరవైందని వాపోతున్నారట కిందిస్థాయి పోలీసు సిబ్బంది. పైస్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు సేఫ్ జోన్ లో వుంటున్నారు. కానిస్టేబుల్స్, హోంగార్డులను డ్యూటీల పేరుతో కరోనా డేంజర్‌లోకి పంపిస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి డీజీ స్థాయి అధికారులు వరకు కిందిస్థాయి సిబ్బందికి, ఆర్డర్ వేసి ఆఫీస్ లో కూర్చుంటారు తప్ప ఫీల్డ్‌లో కనపడరు. కరోనా ఫీల్డ్‌లో వుండే పోలీసులకు కనీస రక్షణ కరువైందన్న చర్చ జరుగుతోంది. ఎవరైనా నిందితులను అరెస్టు చేయడం, వైద్య పరీక్షలు చేయడం, కోర్టు తరలించడం వంటి డ్యూటీల్లో, ఒక రోజంతా వారితోనే వుండాల్సి వుంటుంది. ఆ నిందితుడికి కరోనా వుందో, మరోటి వుందో తెలియదు. ఇలా ఎన్నో ఉదాహరణలు పోలీసుల విధి నిర్వహణలో.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ రేంజ్‌లో విజృంభిస్తోందో చూస్తూనే వున్నాం. పోలీసు శాఖలోనూ కోవిడ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్లపైకి వచ్చి విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, హోంగార్డుల్లో చాలామందికి వైరస్ సోకింది. మరణాలూ సంభవించాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో వున్నారు. అయితే, కరోనా ఎవరికైనా రావొచ్చు. అందుకు కానిస్టేబుళ్లు, హోంగార్డులు మినహాయింపేం కాదు. అందులోనూ నిత్యం కోవిడ్ ఆస్పత్రులతో పాటు రోడ్లపై డ్యూటీ చేసేది కూడా వారే కాబట్టి, వారు మరింత రిస్క్‌ జోన్‌లో వున్నట్టే. అయినా కూడా ప్రాణాలు తెగించి, డ్యూటీ చేస్తున్నారు. చేస్తారు కూడా. కానీ కరోనా పరీక్షల విషయంలో, పైస్థాయి అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై ప్రదర్శిస్తున్న ఉదాసీనత కుంగదీస్తోందన్నది వారి బాధ. రోడ్లపై తిరగకపోయినా, డేంజర్‌ జోన్లలో డ్యూటీ చెయ్యకపోయినా, ఉన్నతాధికారులు మాత్రం ప్రతివారం కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారట. కానీ కానిస్టేబుళ్లు, హోంగార్డులకు మాత్రం, కోవిడ్ టెస్ట్‌లు చేయించడం లేదన్న చర్చ, డిపార్ట్‌మెంట్‌లో జరుగుతోంది. ఉన్నతాధికారులవే ప్రాణాలా కిందిస్ధాయి సిబ్బందివి ప్రాణాలు కాదా అన్న ఆవేదనతో కుమిలిపోతున్నారట. తమకేమైనా అయితే, తమపైనే ఆధారపడిన కుటుంబ స‌భ్యుల పరిస్థితి ఏంటని, లోలోపల బాధపడుతున్నారట కానిస్టేబుళ్లు, హోంగార్డులు.

పోలీసు శాఖలో కరోనా ఎక్కువ కేసులు ఎక్కువగా బయటపడుతున్నది కిందిస్థాయి సిబ్బందిలోనే. ప్రధానంగా కంటైన్మెంట్ జోన్, ఆస్పత్రి, వీఐపీ, వీవీఐపీల భద్రత, నిత్యావసరణ సరుకుల పంపిణీ, పాజిటివ్ రోగుల తరలింపులో ముందు కనిపించేది హోమ్ గార్డ్ లు , కానిస్టేబుళ్లే. కానీ క్రెడిట్ మొత్తం ఉన్నతాధికారులకే వెళుతుంది. ఉన్నతాధికారులు మాత్రం కేవలం ఆదేశాలు జరీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప తమ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానిస్టేబుళ్లు, హోంగార్డులు. రిస్క్ జోన్లలో డ్యూటీలు చేస్తున్నవారికి, కనీసం వారానికో, పది రోజులకో విధిగా కరోనా పరీక్షలు చేయించాలని కోరుతున్నా, పైస్థాయి అధికారులు మాత్రం వినడం లేదట. కనీసం పాజిటివ్ వచ్చిన పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందికి టెస్ట్‌లు కరువయ్యాయట. పోనీ క్వారంటైన్‌లోకి వెళదామంటే, సెలవులూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి మరింతమందికి కరోనా సోకుతోందట.

ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి కరోనా టెస్టులు ఎందుకు చేయించడంలేదన్నదానిపై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. కోవిడ్ టెస్టులు చేయిస్తే, బయటపడినవారికి, సెలవులు ఇవ్వాల్సి వస్తుందని, దీంతో సిబ్బంది బాగా తక్కువ అవుతారని భావిస్తున్నారట పైస్థాయి ఆఫీసర్లు. అంతేకాదు, పోలీసుల్లో నైతికస్థైర్థ్యం దెబ్బతింటుందని చెబుతున్నారట. మరి అటువంటప్పుడు, మీకు మాత్రమే వారంవారం కరోనా టెస్టులందుకంటున్నారు కానిస్టేబుళ్లు. మావి మాత్రం ప్రాణాలు కాదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

కనీసం ఇప్పటికైనా కరోనా టెస్టులు చేయాలని, తమను కూడా మీలో ఒకరిగా భావించాలని కిందిస్థాయి సిబ్బంది వేడుకుంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి, ప్రతి పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి టెస్ట్ లు చేయాలని కోరుతున్నారు. వీలును బట్టి తమకు కూడా సెలవులు మంజూరు చేయాలంటున్నారు. అలాగే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారికి, ఆరోగ్య భద్రతా స్కీమ్‌ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి, కిందిస్థాయి సిబ్బంది మొర, ఉన్నతాధికారులు ఆలకిస్తారో, వదిలేస్తారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories