Top
logo

శైలజనాథ్‌ సైకిల్‌ ఎక్కుతారా.. బండారు శ్రావణిని తప్పించి శైలజానాథ్‌కు అప్పగిస్తారా?

Congress Leader Sailajanath To Join TDP
X

శైలజనాథ్‌ సైకిల్‌ ఎక్కుతారా.. బండారు శ్రావణిని తప్పించి శైలజానాథ్‌కు అప్పగిస్తారా?

Highlights

Sailajanath: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారా?

Sailajanath: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారా? శైలజనాథ్ నిజంగానే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పదేపదే కలవడం దేనికి సంకేతం? కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగించిన పీసీసీ అధ్యక్షుడు భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? త్వరలోనే సైకిల్‌ ఎక్కుతారన్న ప్రచారంలో నిజమెంత? ఆయన అనుచరులు చెబుతున్నది ఏంటి?

రాష్ట్ర విభజనతో కనుమరుగైన జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తూన్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్‌కు పదవి భారంగా మారిందా అంటే అవుననే చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీలో కనీసం ఉనికి కాపాడుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే దాదాపు రెండేళ్లకుపైగా పీసీసీగా కొనసాగిన ఆయన త్వరలో జరగనున్న పార్టీ ఎన్నికల్లో పదవి కోల్పోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో శైలజనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించారని సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం రెండు సార్లు సాదారణ ఎన్నికలు జరిగినా కనీసం ఎక్కడా డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తులోనూ ఎన్నికల్లో గెలుస్థామన్న ఆశలు కనుచూపుమేరలో కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది.

పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ ఏపీలో మాత్రం పూర్తీగా ఉనికిని కోల్పోయింది కాంగ్రెస్‌. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కడా గెలుపొందిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజనకు ముందు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శైలజనాథ్ వైఎస్ హయాంలో రాష్ట్ర మంత్రిగా సమైఖ్యాంధ్ర ఉద్యమ సారథిగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో పార్టీలోనూ కీలక పదవులు అనుభవించారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పదవిలో కొనసాగారు. విభజన తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటకకు ఇన్‌చార్జిగా కొనసాగారు. జాతీయ నేతలతో మరీ ముఖ్యంగా రాహుల్‌గాంధీతో ఉన్న సత్సంబంధాలతో గత సాధారణ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

పీసీసీ అధ్యక్షుడిగా శైలజనాథ్ ఎన్నికైన తర్వాత అడపాదడపా పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నా క్యాడర్ కలిసి రావడం లేదట. పార్టీలో సీనియర్లు జాతీయ నేతలు అని చెప్పుకునే పలువురు ముందు నుంచి శైలజనాథ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. కొందరైతే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో మనస్తాపంతో ఉన్న శైలజనాథ్‌ కొంతకాలంగా అధ్యక్ష పదవిలో భారంగానే కొనసాగుతున్నారన్న ప్రచారం ఉంది. ఇటీవల పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో శైలజనాథ్ కలవడంపై సోషల్‌మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమీప భవిష్యత్తు కనిపించడంలేదని అందుకే రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆ పార్టీలో జోరందుకుంది.

2014లోనే టీడీపీలో చేరేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో కొందరు నేతలు అడ్డుకోవడంతో ఆగారని సమాచారం. అప్పట్లో మాజీ మంత్రి శమంతకమణి కుటుంబానికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారట. తాజాగా మరోసారి ఏపీసీసీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముందు నుంచి శైలజనాథ్ విషయంలో చంద్రబాబు పాజిటివ్‌గా ఉన్నారట. ఆయన పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నక జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలో నిలిపింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించాయి. బద్వేల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కమలమ్మను రంగంలోకి దించింది. ఎన్నికల్లో పోటీ చేయనందున తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ టీడీపీని కోరుతున్నారట. అందుకోసమే చంద్రబాబును నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారట.

ఏమైనా ఇటీవల పలు కారణాలతో శైలజనాథ్ చంద్రబాబును పదే పదే కలుస్తుండడం ఆయన పార్టీ మార్పు అంశం చర్చనీయాంశమవుతోంది. అనంతపురం జిల్లా శింగనమలలోనూ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుండటం పార్టీ మార్పుకు మరింత బలం చేకూరుస్తోంది. మొన్నటి వరకూ ఆ పార్టీ ఇన్‌చార్జి గా వ్యవహరించిన బండారు శ్రావణిశ్రీని కాదని పార్టీ వ్యవహారాలు, కమిటీల నియామకానికి ఆ పార్టీ టూ మెన్ కమిటీని నియమించింది. ఇన్‌చార్జిగా శ్రావణి ఉన్నారా లేరా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. శైలజనాథ్ పార్టీలోకి వస్తారనే శింగనమలలో ఇన్‌చార్జి పదవి ఖాళీగా ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శైలజనాథ్ పార్టీ మార్పు అంశం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి, శైలజనాథ్ ఏ పార్టీలో చేరుతారన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Web TitleCongress Leader Sailajanath To Join TDP
Next Story