ఇచ్చాపురం రచ్చరచ్చకు కారకులెవరు?

ఇచ్చాపురం రచ్చరచ్చకు కారకులెవరు?
x
Highlights

అ అంటే అమలాపురం. ఇ అంటే ఇచ్చాపురం. ఇప్పుడక్కడ ఆ అన్నా, ఇ అన్నా, ఉలుకైనా, పలుకైనా రగడ రగడ అవుతోందట. ఇచ్చాపురం వైసీపీలో రచ్చ రంబోలా అవుతోందట. అధికార...

అ అంటే అమలాపురం. ఇ అంటే ఇచ్చాపురం. ఇప్పుడక్కడ ఆ అన్నా, ఇ అన్నా, ఉలుకైనా, పలుకైనా రగడ రగడ అవుతోందట. ఇచ్చాపురం వైసీపీలో రచ్చ రంబోలా అవుతోందట. అధికార పార్టీలో లుకలుకలు లకలక అంటున్నాయట. పక్క పార్టీ నుంచి వచ్చిన ఓ లీడర్‌కు వ్యతిరేకంగా, ఏళ్లుగా అక్కడే ఫెవికల్ వేసుకు కూర్చున్న నేతలకు అస్సలు పొసగటం లేదట. అందుకే ప్రతీ కార్యక్రమంలోనూ నసుగుడే నసుగుడు. వైసీపీ అధిష్టానానికి జండూబామ్ రాసినా తగ్గని, ఆ తలనొప్పి ఏంటి?

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైసీపీలో లుకలుకలు, లకలకలు శ్రుతిమించిపోతున్నాయి. అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు అగ్గిరాజేస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జ్, డిసిఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, నర్తు నరేంద్ర, లల్లూల మధ్య కోల్డ్‌వార్, పీక్‌ లెవల్‌ టచ్‌ చేస్తోంది. ఈ ఇబ్బందులు కిందిస్థాయి నాయకులకు, క్యాడర్‌కు కూడా ఇబ్బందిగా మారుతున్నాయట. ఎవరెటో తేల్చుకోవాలంటూ క్యాడర్‌కి కరాకండిగా చెప్పేస్తున్నారట నాయకులు. పార్టీ హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా, ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు నేతలు. పార్టీ బలోపేతం గాలికొదిలేసి గ్రూపు రాజకీయాల లొల్లిలో మునిగితేలుతున్నారట.

నిజానికి ఇచ్ఛాపురం వైసీపీలో మొదటి నుంచీ గ్రూపుల గోల ఉందనేది అనేక సందర్భాల్లో బహిర్గతమైంది. అదే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమనేది బహిరంగ రహస్యం. అయితే వీటన్నిటినీ, పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చెయ్యాలన్న అధిష్టానం ఆదేశాలను, కొందరు నాయకులు విస్మరిస్తున్నారట. ముఖ్యంగా నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం దిగజారుడు రాజకీయాలకు తెర లేపుతున్నారన్న ఘాటైన మాటలూ రీసౌండ్‌నిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను పిరియా సాయిరాజ్‌కి అప్పగించింది హైకమాండ్. అది రుచించని కొందరు నేతలు చేస్తున్న పనులకు, పార్టీ పరువు రోడ్డున పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి పిరియా సాయిరాజ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో, ఇచ్ఛాపురంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, అధిష్టానానికి తాను ఇబ్బందిగా మారకూడదన్న ఆలోచనతో పోటీకి దూరంగా ఉంటానని చెప్పేశారు. ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న సాయిరాజ్‌కు, నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అదే సమయంలో 2019 ఎన్నికల్లో సాయిరాజ్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి, అంతా ఒక్కటై పార్టీ కోసం పని చెయ్యాలని ఆదేశించింది. కానీ అసంతృప్తి నేతల ఆధిపత్య పోరు కారణంగానే, ఇచ్ఛాపురంలో వైసీపీ ఓటమిపాలయ్యిందనేది పార్టీ నాయకుల్లో చర్చ.

ఇక ఎన్నికల తర్వాత ఓటమి చెందిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన వైసీపీ హైకమాండ్, సాయిరాజ్‌కు డిసిఎంఎస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అదేసమయంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా అదనపు బాధ్యతలు సాయిరాజ్‌కే అప్పగించి, పార్టీ బలోపేతం దిశగా పని చెయ్యాలని చెప్పింది. దీంతో అసంతృప్తి నేతలంతా ఒక్కటై, సాయిరాజ్‌కు వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనేది జరుగుతున్న చర్చ. ముఖ్యంగా కంచిలి మండలానికి చెందిన ముఖ్య నాయకులు, సాయిరాజ్ టార్గెట్ గా ఇచ్ఛాపురం వైసీపీలో ఓ వర్గంగా ఏర్పడి, కారాలు మిరియాలు నూరుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. కలిసి పని చెయ్యాలని అధిష్టానం చెబుతున్నా వినకుండా, క్యాడర్‌లో చీలికలు పేలికలు తెచ్చి ఆధిపత్యం చేజిక్కించుకోవాలని వ్యూహాలు వేస్తున్నారట లీడర్లు. ఇటీవల ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిపై సాయిరాజ్ తిట్ల పురాణం విప్పారంటూ కొన్ని ఆడియో టేపులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట. అయితే తనను బలిపశువును చేశారంటూ బాధితుడే సాయిరాజ్ వద్ద గోడు చెప్పుకోవడంతో, అధిష్టానం కూడా ఈ విషయాన్ని కొట్టి పారేసిందట. దీంతో ఆ ఇష్యూ అలా క్లోజయ్యింది. కానీ నేతల కోల్డ్‌వార్‌ మాత్రం కొత్తకొత్త రంగులందుకుంటోంది.

పదవుల పందేరమే ఇచ్చాపురం వైసీపీలో చిచ్చుపెట్టిందట. మొన్న ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లలో, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపికైన లోకేశ్వర రావు అనే వ్యక్తిపైనా ఇదే రకమైన ప్రచారాలు జరగడంతో, అసలు ఇచ్ఛాపురంలో ఏం జరుగుతోందంటూ అధిష్టానం కూడా సీరియస్ అయ్యిందట. విబేధాలు, ఆధిపత్య పొరుతో పార్టీ పరువును రోడ్డున పడేస్తే ఉపేక్షించేదిలేదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

అటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సాయిరాజ్‌‌, సెగ్మెంట్‌‌లోనూ అందర్నీ కలుపుకుపోవడం లేదని, ఆయనంటే పడని నేతలు విమర్శిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాయిరాజ్‌కు ఇచ్చాపురం ఇంచార్జ్ బాధ్యతలతో రగిలిపోతున్న అసంతృప్తివర్గం, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిష్టానం చెవిలో వేస్తోందట. అయితే, నియోజకవర్గంలో అసంతృప్తి నాయకులను సమన్వయం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా అంటున్నారు సాయిరాజ్. జగన్ ఆశయాలు నచ్చి ఎమ్మెల్యే పదవిని కూడా లెక్క చెయ్యకుండా, పార్టీలో చేరానని, తనపై జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతల్లో, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటున్నారు. అయితే, అటు అసంతృప్తివర్గం మాత్రం, తమను సాయిరాజ్ పట్టించుకోవడంలేదని రగిలిపోతోంది. ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంది. కానీ పార్టీ పెద్దలకు అన్నీ తెలుసని, దీమాగా వున్నారట సాయిరాజ్. ఇదీ ఇచ్చాపురం వైసీసీలో ఆధిపత్య రగడ.


Show Full Article
Print Article
Next Story
More Stories