అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం..ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం..ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
x
Highlights

సామాన్యుడు చిన్న తప్పిదం చేస్తే ప్రభుత్వాధికారులు కన్నెర్ర చేస్తారు. పెద్దలు పెద్ద తప్పిదం చేసినా ఉన్నతాధికారులు కళ్ళు మూసుకుంటారు. తప్పు ఎవరు చేసినా...

సామాన్యుడు చిన్న తప్పిదం చేస్తే ప్రభుత్వాధికారులు కన్నెర్ర చేస్తారు. పెద్దలు పెద్ద తప్పిదం చేసినా ఉన్నతాధికారులు కళ్ళు మూసుకుంటారు. తప్పు ఎవరు చేసినా ఆయా నిర్మాణాలకు నిబంధనలు అమలు కావాల్సిందే. సుపరిపాలన ప్రజల వద్దకు పాలన పారదర్శక పాలన లాంటి పదాలకు అసలైన అర్థం అదే. మరి ప్రభుత్వాలు ఆ దిశలో చేసే కృషి సఫలమవుతుందా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.

ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలను ప్రభుత్వం ఉపేక్షిస్తే సామాన్యులు సైతం అదే బాటలో పయనిస్తారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించగా లేనిది తాము ఉల్లంఘిస్తా తప్పా అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రజావేదిక పేరు వింటేనే మనస్సులో ఒక మహోన్నత భావం కలుగుతుంది. అది నిర్మాణమైన తీరు మాత్రం అక్రమాలకు వేదిక. మరి అలాంటి అక్రమ వేదిక ను ప్రజావేదిక గా ఉపయోగించుకోవడం మంచిదా ఇదే ప్రశ్న కు ఒక్కో ప్రభుత్వ హయాంలో ఒక్కో రకం సమాధానం లభించింది. గత ప్రభుత్వం ఈ ప్రజావేదికను సక్రమం చేయాలని భావించింది. కొత్త ప్రభుత్వం మాత్రం దాన్ని కూల్చివేయాలని చూస్తోంది. రెండిటికీ మధ్య ఎంతో తేడా ప్రభుత్వాధినేతలు మారినంత మాత్రానా విధానాలు, నిబంధనలు మారుతాయా అనే ప్రశ్నకు ఇప్పుడు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. అక్రమ నిర్మాణాలు వేటినీ సహించేది లేదని కూల్చివేత ఒక్కటే మార్గమని కొత్త ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందుకే ప్రజావేదికను సమూలంగా కూల్చేందుకు సంసిద్ధమైంది. చిన్న వాళ్ళు తప్పు చేస్తే చర్య తీసుకుంటామని మనమే తప్పు చేస్తే ఎలా సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలన్నారు.

ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘిస్తే తాము సైతం అలా చేయడంలో తప్పు లేదనే సామాన్యులు భావిస్తారు. అంతా అలానే భావిస్తే ఇక ప్రజాస్వామ్యంలో మిగిలేది అరాచకమే. అలాంటి అరాచకం రావద్దనే ఏపీ నూతన సీఎం జగన్ భావించారు. తెలుగుదేశం వాదన మాత్రం మరోలా ఉంది. ప్రజావేదిక భవనాన్ని విపక్ష నాయకుడిగా చంద్రబాబు ఇవ్వాల్సి వస్తుందని భావించే దాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలను స్వీకరించేందుకు గాను ప్రజావేదిక భవనాన్ని కేటాయించాలని చంద్రబాబు కోరినట్లుగా వారు చెబుతున్నారు. వారే మరో అడుగు ముందుకేసి పూర్తిస్థాయి అనుమతులు రాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను కూడా కూల్చివేస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

అనుమతుల్లో జాప్యం నిబంధనల ఉల్లంఘన రెండూ కూడా వేరు వేరు అంశాలు. అమరావతి పోలవరం విషయాలకు వస్తే అవి రాష్ట్ర విభజనతో ముడిపడిన అంశాలు. ఇవాళ కాకపోయినా రేపయినా అనుమతులు వస్తాయి. ఆ బాధ్యత కేంద్రానిదే. ఇక నిబంధనల ఉల్లంఘనకు వస్తే అవి రాష్ట్రస్థాయిలో జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనల ఉల్లంఘనను చూసీ చూడనట్లుగా ఉండేందుకూ ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా ప్రభుత్వపెద్దలే అక్రమ నిర్మాణాలను వాడుకలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నంత మాత్రాన ప్రభుత్వం అనుమతించినంత మాత్రాన నిబంధనల ఉల్లంఘన సక్రమం కాదు. అది ఓ మచ్చలా అలా మిగిలిపోతుంది. మచ్చ లేని పాలన అందించాలనుకుంటే మాత్రం అది ఇబ్బందికరంగానే ఉంటుంది. భవన నిర్మాణానికి అనుమతులు పొందడం దగ్గరి నుంచి నిర్మాణ వ్యయం దాకా పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా కూడా వెల్లడవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆ విషయాలను ప్రకటిస్తున్నారు. ఈ భవన నిర్మాణ వ్యయాన్ని 5 కోట్ల నుండి 8 కోట్ల రూపాయలకు పెంచారని జగన్ తెలిపారు.

ప్రజావేదిక లో జరిగిన సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపిందుకే ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో ఇదే చివరి సమావేశమని జగన్ చెప్పారు. ఆయన మాటలన్నీ కూడా అధికార వ్యవస్థకు ఓ స్పష్టమైన సందేశాన్ని అందించాయనడంలో సందేహం లేదు. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియతో రాష్ట్రవ్యాప్తంగా కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది.

ప్రజావేదికతో సహా మరెన్నో భవనాలకు అధికార వ్యవస్థ అండదండలు ఉన్నాయనడంలో సందేహం లేదు. అధికార వ్యవస్థ అండదండలు లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవనడం అతిశయోక్తి కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్యుడినైనా కొంతమేరకు క్షమించవచ్చేమో కానీ సంపన్నులను సాక్షాత్తూ ప్రభుత్వాన్ని క్షమించడం మాత్రం సాధ్యం కాదు. సీఎం జగన్ ఈ అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజావేదిక నిర్మాణానికి వెచ్చించిన ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాదు. కాకపోతే నిబంధనల ఉల్లంఘన నిర్మాణ వ్యయం పెంపులో అక్రమాలు లాంటివి మొత్తం అధికార వ్యవస్థనే అప్రతిష్టపాలు చేశాయి. ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు ఉల్లంఘించకుండా ఉంటారా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం హర్షణీయం. అయితే అక్రమనిర్మాణాలు అమరావతికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటిపై కూడా కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే అధికార వ్యవస్థను ప్రక్షాళన చేసినట్లవుతుంది.

నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించిన సమయంలో వాటి కూల్చివేతకు వెనుకాడాల్సిన అవసరం లేదు. ఎంతో డబ్బు ఖర్చు చేశారు కదా అదంతా వృథా అవుతుంది కదా అని బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోడీకి చెందిన ఓ ఖరీదైన భవనాన్ని మహారాష్ట్రలో అధికారులు కూల్చేశారు. తీరప్రాంతంలో 33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా వెల్లడి కావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ భవనాన్ని కూల్చివేశారు. ఇక ముంబైలో ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కూడా నిబంధనల ఉల్లంఘనతోనూ ముడిపడింది. ఆరు అంతస్తులు నిర్మించాల్సిన చోట 31 అంతస్తులు నిర్మించారు. వందల కోట్ల ఖరీదైన ఆ భవనాన్ని ఉల్లంఘించాల్సిందిగా న్యాయస్థానాలు ఆదేశించాయి. ఎంతో డబ్బు వెచ్చించాం రెగ్యులరైజ్ చేయండి అంటే కుదరదు నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేత తప్పదు అనే సందేశాన్ని ఈ తీర్పులు అందిస్తున్నాయి. న్యాయస్థానాల వరకూ వెళ్ళకముందే ప్రభుత్వమే ముందుకు వచ్చి అధికార వ్యవస్థ చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత తీసుకోవడం అభినందనీయం. అయితే ఇదే చొరవనూ అన్ని అక్రమ నిర్మాణాల విషయంలోనూ అనుసరించాలి. అస్మదీయులకు మినహాయింపులు ఇస్తే మాత్రం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కొత్త ప్రభుత్వం కూడా చేసినట్లు అవుతుంది. చట్టం ఎవరికీ చుట్టం కాదు అనే తరహాలో అధికార వ్యవస్థ మెలగాలి. సంపన్నులకో చట్టం పేదలకో చట్టం అమలు చేస్తే అది సమాజంలో అశాంతికి దారి తీస్తుంది. ప్రజలకు ప్రజస్వామ్యం పై నమ్మకం పోయేలా చేస్తుంది. అలా గాకుండా జాగ్రత్త పడాల్సింది ప్రభుత్వమే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories