CM Chandrababu: శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 2:09 PM IST
CM Chandrababu: శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019-24 మధ్య రాష్ట్రంలో సాగింది పరిపాలన కాదు, విధ్వంసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన గాయాల నుంచి రాష్ట్రాన్ని క్రమక్రమంగా గాడిలో పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

అసెంబ్లీలో అవమానం - భావోద్వేగ క్షణాలు:

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. "నాడు సభలో నన్ను ఎంతగానో అవమానించారు, ఆ బాధతో కన్నీళ్లు పెట్టుకుని సభను వీడాను. నా ఒక్కడినే కాదు, గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకునేలా వైసీపీ నేతలు వ్యవహరించారు" అని చంద్రబాబు మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తనను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం:

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని, విభజన హామీల అమలు బాధ్యతను కేంద్రం తీసుకుందని ఆయన తెలిపారు.

నీతులు చెబుతున్న వారికి కౌంటర్:

"నాడు వ్యవస్థలను అడ్డుకుని, విధ్వంసం సృష్టించిన వారే ఇప్పుడు సభలో నీతులు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది" అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి సీఎం ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతోందని, ప్రజల ఆశలను వమ్ము చేయబోమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story