CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలనం: 2022లోనే కల్తీ నివేదిక వచ్చినా వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

CM Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 3:17 PM IST
CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలనం: 2022లోనే కల్తీ నివేదిక వచ్చినా వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?
X

CM Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మంపై, భక్తుల విశ్వాసాలపై యుద్ధం ప్రకటించిందని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడటం క్షమించరాని మహా పాపమని ఆయన మండిపడ్డారు. ఉండవల్లిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశం అనంతరం మీడియాలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.

2022లోనే రిపోర్ట్ వచ్చినా తొక్కిపెట్టారు:

ఈ కల్తీ వ్యవహారంపై గత ప్రభుత్వానికి ముందే తెలుసని చంద్రబాబు ఆరోపించారు. "2022లోనే సీఎఫ్టీఆర్ఐ (CFTRI) నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉన్నా, అప్పటి పాలకులు ఆ రిపోర్ట్‌ను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. భక్తుల మనోభావాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎన్‌డీడీబీ (NDDB) ద్వారా నిజాలు బయటపెట్టాం" అని ఆయన వివరించారు.

దైవ కార్యాల ప్రక్షాళనే నా మొదటి ప్రాధాన్యత:

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనతో పాటు తిరుమల ప్రక్షాళనపై దృష్టి పెట్టానని చంద్రబాబు తెలిపారు. "మానవ సేవ కన్నా మాధవ సేవ ముఖ్యమని భావించి, టీటీడీ ఈఓగా శామలరావును నియమిస్తూ రెండో సంతకం చేశాను. ఏడుకొండల స్వామి పవిత్రతను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. బ్రిటిష్ వారు కూడా స్వామివారి సంప్రదాయాలను గౌరవించారు, కానీ మీరు దారుణంగా అపవిత్రం చేశారు" అని విమర్శించారు.

ఏకసభ్య కమిషన్‌తో సమగ్ర విచారణ:

గత ఐదేళ్లలో రాముడి విగ్రహ శిరచ్ఛేదనం, అంతర్వేది రథం దహనం వంటి ఘటనలను గుర్తు చేస్తూ.. వైసీపీ నేతలు దేవుడితో పెట్టుకున్నారని, దానికి ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఈ కల్తీ కుంభకోణంపై అవసరమైతే ఏకసభ్య కమిషన్ వేసి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story