Visakhapatnam: విశాఖపట్నం రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్?

CM Camp Office In Visakhapatnam Rushikonda
x

Visakhapatnam: విశాఖపట్నం రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్?

Highlights

Visakhapatnam: దసరాకు రుషికొండకు సీఎం విశాఖ రావడం ఖాయమంటూ ప్రచారం

Visakhapatnam: దసరాకు సీఎం జగన్ విశాఖపట్నం కేంద్రంగా పాలన ప్రారంభించడం ఖాయమైందా..? రుషికొండపై టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతున్న నిర్మాణాలు అందుకేనా..? బయటకు పర్యాటక ప్రాజెక్టులు అని చెబుతున్నా.. సీఎం క్యాంపు కార్యాలయం కడుతున్నారన్నదే అసలు వాస్తవమా..? నిన్న ఇంటిలిజెన్స్ సెక్యురిటీ వింగ్ అధికారుల పర్యటించడం ఈ ప్రచారాలకు మరింత చేకూరుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుండి దసరాకి పరిపాలన ప్రారంభం చేయనున్నారు అనే సంకేతాలు వచ్చేశాయి.. స్వయం గా ముఖ్యమంత్రి విశాఖ వస్తున్నాను ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేశారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో కూడా మరోసారి అదే ప్రకటన చేశారు. దీంతో విశాఖలో ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ అనే అంశం ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇప్పటికే విశాఖలో రుషికొండ, బైపర్క్, మధురవాడ లో కొన్ని భవనాలు, ఐటీ హిల్స్‌ని అధికారులు, సీఎం కుటుంబ సభ్యులు పరిశీలించారు. అలాగే బీచ్ రోడ్‌లో ఉన్న కొన్ని హోటళ్లని కూడా చూశారు. అయితే రుషికొండ చివరికి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రుషికొండ దగ్గర జరుగుతున్న నిర్మాణాలు సీఎం నివాసం కోసమే అనే ప్రచారం జరుగుతోంది. పర్యాటక ప్రాజెక్టులు అంటూ టూరిజం డిపార్ట్‌మెంట్‌ బయటకు చెబుతున్నా.. సీఎం నివాసం కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణాల డిజైన్‌ కూడా రిసార్టుల మాదిరిగా కాకుండా కార్పొరేట్‌ కార్యాలయం తరహాలో కనిపిస్తున్నాయి. మొత్తం నాలుగు బ్లాక్ లు నిర్మిస్తున్నారు. క్యాంప్ కార్యాలయం కోసం వీటి నిర్మాణం జరుగుతుంది అనే ప్రచారం ఉంది. ముందుగా వెంగ, కళింగ అనే బ్లాక్స్ నీ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ బ్లాక్‌లన్నీ కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఉండడంతో సీఎం దసరాకు రావడం పక్కాగా కనిపిస్తోంది. భవనాల్లో ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. ఆయా పనులను ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం అధికారులు పరిశీలించారు. ఇప్పటికే అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది అక్టోబరు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్వహిస్తే.. సీఎంతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వారానికి మూడు రోజులు విశాఖలో, మిగిలిన మూడు రోజులు అమరావతిలో ఉండనున్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అయితే ఈ బిల్లుకు చట్టబద్ధత లభించకపోవడం, న్యాయస్థానంలో కేసులు విచారణలో ఉండడంతో అధికారికంగా విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి అవకాశం లేదు. అందుకే క్యాంపు కార్యాలయం పేరుతో రుషికొండలో సీఎం పేషీ ఏర్పాటుచేసి పాలన సాగించనున్నారని తెలుస్తోంది. ముఖ్య అధికారుల కోసం రుషికొండ, ఎండాడలతో పాటు సీతమ్మధారలోని ఆక్సిజన్‌ టవర్స్‌లో ఫ్లాట్లు, మరికొన్నిచోట్ల విల్లాలు రిజర్వ్‌ చేసి పెట్టినట్లు సమాచారం. ఇటీవల టీడీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్‌ సెప్టెంబరులో విశాఖ నుంచి పాలన సాగిస్తారని, అందులో కొత్త విషయం ఏమీ లేదని, అది గతంలో ఆయన చేసిన ప్రకటనే అంటూ సమర్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories