సొంత జిల్లాలో చంద్రబాబుకు విస్తుపోయే అనుభవమేంటి?

సొంత జిల్లాలో చంద్రబాబుకు విస్తుపోయే అనుభవమేంటి?
x
Highlights

అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ వద్దన్నా నేతలు. చోటామోటా నాయకులందరూ ఆయన ప్రసన్నత కోసం ఎగబడ్డవాళ్లే. పదవులు కావాలి, టికెట్లు కావాలి అంటూ అధినేత ముందు...

అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ వద్దన్నా నేతలు. చోటామోటా నాయకులందరూ ఆయన ప్రసన్నత కోసం ఎగబడ్డవాళ్లే. పదవులు కావాలి, టికెట్లు కావాలి అంటూ అధినేత ముందు మోకరిల్లినవాళ్లే. కానీ ఇప్పడాయన ఆ జిల్లాలో అడుగుపెడితే, ఒక్కరూ కనిపించడం లేదు. అధికారం అనుభవించి, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అసలే ఓడిపోయిన నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌కు భరోసా ఇవ్వాల్సిన నేతలు, దూరంగా జరిగిపోతున్నారు. ఏకంగా పార్టీ చీఫ్‌ ప్రోగ్రామ్‌కు కూడా అటెండ్‌ కావడం లేదు. అదే ఆయనలో వారిపట్ల అసహనం పెంచుతోంది.

సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు జిల్లాకు ఎన్ని సార్లు వచ్చినా కుప్పం నుంచి తడ వరకు ఎక్కడ కాలుమోపినా క్యూకట్టే నేతలు ఇప్పుడు కానరావడం లేదు. చంద్రబాబు వచ్చారంటే ఎగబడి,గొడవ పడి ఆయన దృష్టిలో పడాలని తపనపడే నేతలు, అధికారం కోల్పోయిన నెల రోజులకే ముఖం చాటేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా చిత్తూరు జిల్లాలో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షాత్తు ఆయన చిత్తూరు జిల్లాకు వస్తే ఒకరిద్దరు నేతలు, కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు తప్ప ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చిన నేతలే కరువయ్యారు. జిల్లాలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన నియోజకవర్గ అభ్యర్థులు కూడా రాలేదు. అంతెందుకు పక్కనే ఉన్న నియోజకవర్గం పలమనేరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అమరనాధ రెడ్డి కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇది పెద్దగా చర్చకు రాకపోయినా, ఆయన వెళ్ళిపోయాక మాత్రం క్యాడర్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. అధికారంలో ఉన్నప్పుడు కాలరెగరేసి, మేమే అంతా అని చెప్పిన వారెక్కడ అని ద్వితియ శ్రేణి నాయకులను దెప్పి పొడుస్తున్నారు కార్యకర్తలు.

రాష్ర్ట విభజన తరువాత తొలిసారిగా ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి, ఈ జిల్లా నుంచి ఆరుగురు ఎంఎల్ఎలు, ఒక ఎంపి గెలిచారు. మొత్తం పద్నాలుగు ఎమ్మెల్యేస్థానాల్లో టిడిపికి తక్కువే వచ్చాయి. ఆ తరువాత పరిణామాల్లో వైసిపి నుంచి గెలిచిన అమరనాధరెడ్డి టిడిపిలో చేరడంతో చెరో సగం ఎమ్మెల్యేలుగా టిడిపి, వైసిపి బలం చేరింది. ఈసారి ఎన్నికల్లో కుప్పం మినహాయించి ఒక్క సీటు కూడా టిడిపి గెలవలేదు. మంత్రి అమరనాధ రెడ్డి కూడా ఓడిపోయారు. అంతే కాదు చంద్రబాబు గెలుపు కూడా అంతంత మాత్రం మెజారిటీతోనే నమోదైంది. దీంతో లీడర్లలోను, క్యాడర్లోనూ తీవ్రమైన నైరాశ్యం చోటు చేసుకుంది. అయితే ఐదేళ్ళ కాలం పాటు అధికారంలో ఉన్న నేతలు, ఇంత నైరాశ్యానికి లోనుకావడంతో క్యాడర్ డైలమాలో పడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ అంతకుముందు అధికారాన్ని అనుభవించిన వారే. అభ్యర్థులందరూ కీలకమైన పదవుల్లో బాధ్యతల్లో ఉన్నవారే. అయినా అధికారం పోగానే వారు ఓటమి చవి చూడగానే కనిపించుకుండా పోయారనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణగా చంద్రబాబు పర్యటన గురించి మాట్లాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

ఐదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించి క్యాడర్ భుజాల మీద నడిచి, ఓడిపోగానే వదిలిపెట్టేశారని ఇలాంటి వారికే టిడిపిలో చోటుంటుందనే విమర్శలు ద్వితియ శ్రేణినాయకులు, క్యాడర్లోని సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధినేత వస్తే జిల్లాలోని లీడర్లు కనీసం పలకరించడానికి కూడా రాలేని దైన్యాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. సొంత జిల్లాలో ఈ పరిస్థితిపై బాబు కూడా ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే అసలే నైరాశ్యంలో ఉన్న వారిని ఎక్కువ ఒత్తిడి చేస్తే ఫలితాలు మరోలా ఉంటాయేమోనన్న ఆలోచనతో, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే క్రింది స్థాయిలో మాత్రం లీడర్ షిప్ పై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.

చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో టీడీపీ తరపున నోరెత్తి మాట్లాడే నేత కనిపించడం లేదు. ఒక స్టేట్‌మెంట్ ఇచ్చే వారు కూడా కనిపించలేదు. దీంతో గ్రామస్థాయిలో ఉన్న వారు, మండల స్థాయిలో ఉన్న వారు తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోతున్నారని, ఇంతలోనే అంత మారిపోతే ఐదేళ్ళు అండ ఎవరుంటారని వాపోతున్నారు కార్యకర్తలు. బలమైన క్యాడర్ కలిగిన టిడిపికి లీడర్లతోనే సమస్య వస్తోందని, అధినేత అలాంటి వారినే గెలుపు గుర్రాల పేరుతో ప్రోత్సహిస్తుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి క్యాడర్ బాధను తీర్చే లీడర్లుగా ఎవరు ముందుకు వస్తారు క్యాడర్లోంచే కొత్త లీడర్ షిప్ పుట్టుకొస్తుందా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీను ముందుండి నడిపించేవారెవరు?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories