చీరాల రాజకీయంలో అసలేం జరుగుతోంది?

చీరాల రాజకీయంలో అసలేం జరుగుతోంది?
x
Highlights

శాసన సభ్యుడిగా, ఆ నియోజకవర్గంలో ఆ‍యన చేసిందే శాసనం. చెప్పిందే వేదం. ఎవరు అడ్డొచ్చినా డోంట్‌ కేర్, అతని నైజం. తొక్కి పారేస్తాడంతే. కానీ, కాలచక్రం...

శాసన సభ్యుడిగా, ఆ నియోజకవర్గంలో ఆ‍యన చేసిందే శాసనం. చెప్పిందే వేదం. ఎవరు అడ్డొచ్చినా డోంట్‌ కేర్, అతని నైజం. తొక్కి పారేస్తాడంతే. కానీ, కాలచక్రం గిర్రున తిరిగింది. అతని అధికారం పోయింది. అయినా ఆయన ధైర్యం ఏంటంటే, తాను ఓడిపోయినా, పవర్‌లోకి తన పార్టీ వచ్చిందని. దీంతో మునుపటి కంటే జోష్‌గా, నియోజకవర్గాన్ని శాసించాలని డిసైడయ్యాడు. కానీ కథ అడ్డం తిరుగుతోంది. తాను అనుకున్నట్టుగా వ్యవహారం సాగడం లేదు. తండ్రీ కొడుకులు, ఆ నేతకు చుక్కలు చూపిస్తున్నారట. ఇంతకీ ఎవరా మాజీ బాస్...తాజాగా ఎందుకా పరిస్థితి ఆ సెగ్మెంట్‌లో అసలేం జరుగుతోంది..?

ప్రకాశం జిల్లా చీరాల అనగానే, గుర్తొచ్చే మాస్‌ లీడర్‌ ఆమంచి కృష్ణమోహన్‌. తనదైన రాజకీయాలతో చీరాలలో దూకుడున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా చక్రం తిప్పారు. కానీ ఒక్క ఓటమితో సీన్‌ మొత్తం రివర్సయ్యింది. ఒకసారీ జడ్పీటీసీ మెంబర్‌గా, ఒకసారి ఎంపీపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమంచి కృష్ణ మోహన్. క్షేత్రస్థాయిలో సామాన్యులతో మమేకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ సీఎం రోశయ్యను రాజకీయ గురువుగా భావించే ఆమంచి, ఆయన హయాంలో చక్రం తిప్పారు. కాపు ఉద్యమనేతగాను హవా నడిపిన ఆమంచి, 2014 ఎన్నికల్లో స్వతంత్ర

అభ్యర్ధిగా గెలిచి, ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు, తనతో పాటు మరికొందరు కాపు నేతలతో కలిసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చీరాల ఎన్నికల్లో తనకు ఎదురేలేదనుకున్న ఆమంచి, టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అక్కడి నుంచి ఆమంచి కథ రివర్సయ్యింది. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, గెలిచిన కరణం బలరాం, ఇటీవల వైసీపీకి మద్దతు తెలుపుతూ తన కుమారుడు కరణం వెంకటేష్‌ని ఫ్యాన్‌ చెంతకు చేర్చారు. వెంకటేష్‌ నియోజకవర్గంలో చక్రంతిప్పడం మొదలుపెట్టారట. ఓడిపోయినా, పార్టీ పవర్‌లో వుంది, హవా నడిపించి, కరణంకు చుక్కలు చూపిద్దామనుకున్న ఆమంచికి, పరిస్థితులు పగబట్టాయి. చివరికి కరణం వర్గమే ఆమంచికి చెక్‌ పెట్టేందుకు రకరకాల వ్యూహాలు వేస్తోందట. ఆమంచి అనుచరులను సైతం, తనవైపు తిప్పుకుంటున్నారట. దీంతో చీరాల రాజకీయం, రణక్షేత్రంలా మారింది.

మొన్న కొడుకు, నిన్న తండ్రి ఎప్పుడు చీరాలలో బహిరంగ సభలు పెట్టినా, సూటిగా కాకపోయినా, ఇన్‌డైరెక్టుగా ఆమంచికి వార్నింగ్‌లు ఇస్తున్నారట. మొన్నటి వరకు ఆమంచి వెంటే తిరిగిన కార్యకర్తలు సైతం, కరణం ఫ్యామిలీ ప్రసంగాలకు చప్పట్లు, ఈలలతో హోరెత్తిస్తుండటంతో, ఆమంచి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారట. మొన్నామధ్య క్లాక్ టవర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, కరణం వెంకటేష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదనడం, ఆమంచికే సూటిగా తగులుతోందని జనం మాట్లాడుకుంటున్నారు. వైసీపీ చీరాల ఇన్‌చార్జ్‌గా వున్న తననే టార్గెట్ చేస్తూ, కరణం అలజడి సృష్టిస్తున్నారని ఆమంచి ఫైర్‌ అవుతున్నారట. దీనిపై పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారట. అది మరువక ముందే మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో, కరణం మరోసారి మాటల తూటాలు పేల్చారట. వైసీపీ ప్రభంజనంలోనే, తాను టీడీపీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచానని అన్నారట. చిన్నాచితక వ్యాపారులను సతాయిస్తే, ఊరుకునేదిలేదని వార్నింగ్ సైతం ఇచ్చారట బలరాం.

తండ్రీ కొడుకు ఒకరి తర్వాత ఒకరు, ఆమంచికి పరోక్షంగా వార్నింగ్‌లు ఇచ్చారంటూ, చీరాలలో హాట్‌హాట్‌ డిస్కషన్‌ సాగుతోంది. ఎలాగైనా చీరాల నుంచి ఆమంచిని వెళ్లగొట్టి, తండ్రీకొడుకులు గుప్పిట పట్టాలని చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. ఇలా ఒకప్పుడు చీరాలను శాసించిన ఆమంచికి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అధికారులు, పోలీసుల దగ్గర, ఆమంచి మాట చెల్లుబాటుకాకపోవడంపై, ఆయన అనుచరులు తీవ్ర అసహనంతో ఉన్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, మన మాట ఎందుకు చెల్లుబాటు కావడం లేదని వైసీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా, తన మాటకు ఎదురులేదని భావించే ఆమంచిని, జరుగుతున్న పరిణామాలుతీవ్రంగా కలచి వేస్తున్నాయట. కరణం బలరాం, వెంకటేష్‌లు, వరుసబెట్టి మాటల తూటాలు పేల్చడం, వార్నింగ్‌లు ఇవ్వడం ఆమంచికి ఏమాత్రం రుచించడం లేదట. అధిష్టాన పెద్దలు సైతం, కరణం పట్ల సానుకూలంగా వుండటం, చూసీచూడనట్టు వ్యవమరించడాన్ని గమనిస్తున్న ఆమంచి వర్గం, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో వుందట. టైమ్‌ బ్యాడ్‌ అని నిట్టూరుస్తున్నారట. మనకూ మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్నారట.


Show Full Article
Print Article
Next Story
More Stories