చెన్నూరు చక్కెర పరిశ్రమ రీఓపెనింగ్ పై కార్మికుల ఆశలు

చెన్నూరు చక్కెర పరిశ్రమ రీఓపెనింగ్ పై కార్మికుల ఆశలు
x
Highlights

కడప జిల్లాలో మూతపడ్డ చెన్నూరు చక్కెర పరిశ్రమ పున:ప్రారంభం కోసం కార్మికులు, రైతులు ఆశగా ఎదురుచుస్తున్నారు. ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు జగన్...

కడప జిల్లాలో మూతపడ్డ చెన్నూరు చక్కెర పరిశ్రమ పున:ప్రారంభం కోసం కార్మికులు, రైతులు ఆశగా ఎదురుచుస్తున్నారు. ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాది గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడడంలేదు. సీఎం జగన్ తమ ఆశలను తప్పక నెరవేరుస్తాడని, చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తారని కార్మికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోని చెన్నూరు చక్కెర పరిశ్రమ పునః ప్రారంభానికి గతేడాది రాష్ట్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. తర్వాత ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడం కార్మికులను, రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తొంది. చక్కెర పరిశ్రమ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

1977లో చెన్నూరు చక్కెర పరిశ్రమ ప్రారంభమైంది. దాదాపు 13 వందల మంది ఉద్యోగులు పనిచేసేవారు. కొన్నేళ్లపాటు లాభాలబాటలో ప్రయాణించిన ఈ పరిశ్రమకు రాను రాను క్రషింగ్‌కు తగినంత చెరుకు రాకపోవడంతో రైతులకు చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో 1985లో లేఆఫ్‌ ప్రకటించారు. 1995లో మరోసారి లే ఆఫ్‌ ప్రకటించి మూతవేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం హోదాలో చెన్నూరు చక్కెర పరిశ్రమ పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. ఐడీబీఐ నుంచి తీసుకున్న అప్పు 3 కోట్ల 11 లక్షల అప్పును ప్రభుత్వమే చెల్లించింది. పాడైన యంత్రాల స్థానంలో కొత్తవి అమర్చేందుకు 18 కోట్లు మంజూరు చేసింది. రిటైర్‌ ఉద్యోగుల బకాయిలు 40 లక్షలు చెల్లింపులు జరిపింది. రన్నింగ్‌ క్యాపిటల్‌ కింద ఆప్కాబ్‌ నుంచి 3 కోట్లు రుణం ఇప్పించడంతో చక్కెర పరిశ్రమ తిరిగి తెరుచుకుంది.

చెన్నూరు చక్కెర పరిశ్రమ సాఫీగా సాగుతుందని అందరూ భావిస్తుండగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పరిశ్రమ పరిధిలో ఉన్న 8500 మంది షేర్‌ హోల్డర్స్‌గా ఉండేవారు. చెరుకు ఉత్పత్తి మరింతగా పెంచేందుకు పరిశ్రమ ద్వారా సీడ్‌ అందించారు. ఆ తరువాత రైతులకు సీడ్‌ అందక, చెరుకు పరిశ్రమకు రాక క్రషింగ్‌ ఆగిపోయింది. రైతులే పరిశ్రమకు బకాయిలు పడ్డారు. అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి చక్కెర పరిశ్రమ మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూతబడిన చక్కెర పరిశ్రమలో 400 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, వీరిలో 54 మంది చనిపోయారు. గత ఏడేళ్ల నుంచి 311 మంది ఉద్యోగులు, కార్మికులు పెండింగ్ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.

కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు 15 కోట్లు, యంత్రాల రిపేర్లు, ఇతర అవసరాలకు మరో 10 కోట్లు మొత్తం 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తే చెన్నూరు చక్కెర పరిశ్రమ తిరిగి ప్రారంభమవుతుంది. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జగన్‌ గత ఏడాది కేబినెట్ లో ఇందుకు ఆమోదముద్ర వేశారు. కానీ ఇందుక సంబంధించిన చర్యలు మొదలుకాలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరగా అమలుచేయాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు. చెన్నూరు చక్కెర పరిశ్రమ రీ ఓపెనింగ్ అయితే వెయ్యిమందికి ఉపాధి లభించేఅవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories