వైసీపీ అధినేతను చీపురుపల్లి ఎలా మెప్పించింది?

వైసీపీ అధినేతను చీపురుపల్లి ఎలా మెప్పించింది?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. కానీ వైసీీపీ అధినేత జగన్‌కు ఆ నియోజకవర్గం గెలుపు మాత్రం భలే కిక్కిచ్చింది. అక్కడ ఎలాగైనా తమ...

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. కానీ వైసీీపీ అధినేత జగన్‌కు ఆ నియోజకవర్గం గెలుపు మాత్రం భలే కిక్కిచ్చింది. అక్కడ ఎలాగైనా తమ అభ్యర్థి గెలవాలని తపించారు జగన్. ఎందుకంటే, అక్కడ గెలిస్తే అధికారం పక్కా అని, దశాబ్దాలుగా ప్రధాన పార్టీల నమ్మకం. అందుకే గెలుపు అక్కడ కీలకమనుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఉద్దండ నాయకుడే బరిలోకి దిగారు. గెలిచారు. పవర్‌లోకి వచ్చారు. సెంటిమెంట్‌ ప్రూవ్‌ అయ్యిందని మరోసారి అనుకున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆ నియోజకవర్గంలో, తెలుగుదేశం మాత్రం, ఎందుకు అలా అనుకోలేదు? ఎందుకు ప్రెస్టీజియస్‌గా తీసుకోలేదు?

విజయనగరం జిల్లాలో చీపురుపల్లి సెంటిమెంట్‌ మొదటి నుంచి అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే, రాష్ట్ర పీఠం అదే పార్టీదే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కిమిడి మృణాళిని గెలిచారు. తెలుగుదేశానికి అధికారమొచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ‌్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేసి, విజయం సాధించారు. వైసీపీ అధికారం చేపట్టింది. గతంలోనూ ఇలానే జరిగింది. దీంతో చీపురుపల్లిని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. సెంటిమెంట్‌పరంగా కూడా ముఖ్యం కాబట్టి, జాగ్రత్తగా ఆలోచించి, దీటైన నాయకులకు, మరింత దీటైన అభ‌్యర్థులనే నిలబెడతాయి. అధికారానికి, ఇక్కడ గెలవడానికి ఆలోచిస్తే లాజికల్‌గా సంబంధముండకపోయినా, సెంటిమెం‌‌ట్‌‌ను పార్టీలు సీరియస్‌గా తీసుకుంటాయి. అందుకే మంచి అభ్యర్థులను నెలబెట్టి గెలవాలని తపిస్తాయి. అయితే ఈ విషయంలో తెలుగుదేశం ఓవర్‌కాన్ఫిడెన్స్‌గా ఆలోచించి బొక్కబోర్లా పడిందని సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు.

చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉద్దండుడైన బొత్స సత్యనారాయణను నిలబెట్టింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్. కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునను బరిలోకి దింపింది తెలుగుదేశం. బొత్స లాంటి అనుభవం, పట్టున్న నాయకునిపై ఏమాత్రం అనుభవంలేని, ప్రజలతో నేరుగా సంబంధాల్లేని నేతను నిలెబెట్టి, మూల్యం చెల్లించుకుందని, తెలుగేదేశం సొంత పార్టీ నేతలే ఘాటుగా మాట్లాడుకుంటున్నారని చర్చ జరుగుతోంది.

చీపురుపల్లి నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ప్రాధాన్యతలున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా స్థానికేతరులే పగ్గాలు చేపట్టిన చరిత్ర ఉంది. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న బొత్స సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలి ప్రయత్నంలోనే మంత్రిగా స్థిరపడ్డారు. ఇక అక్కడ నుంచి పదేళ్ల పాటు వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా చక్రంతిప్పారు. విభజన పాపం మూటకట్టుకుని 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన బొత్స, ఇపుడు తన పూర్వపు జోష్‌తో తనకు బాగా అచ్చొచ్చిన చీపురుపల్లిలో వైసీపీ తరపున జెండా ఎగరేసి, మంత్రి పదవినీ చేపట్టి, సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. అయితే అటు టీడీపీ మాత్రం, చీపురుపల్లిని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, అందుకు నిదర్శనం అభ్యర్థి ఎంపికేనని టీడీపీ స్థానిక నేతలే మాట్లాడుకుంటున్నారు. తల్లిచాటు బిడ్డగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున, బలమైన ప్రత్యర్దిని ఎదుర్కోవడంలో ఎకోశాన పోటీనివ్వలేక చేతులేత్తేశారని చర్చించుకుంటున్నారు. బలమైన ప్రత్యర్దిపై ఎటువంటి అంచనాలతో నాగార్జునకు టిక్కెట్టు కేటాయించారోనన్న సందేహం ఇప్పటికీ నియోజకవర్గ నాయుకులకు అంతుపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది.

మొత్తానికి తాను రెస్ట్ తీసుకుని కుమారునికి పట్టాభిషేకం చేయాలని కిమిడి మృణాళిని తపించారు. కానీ గ్రౌండ్‌ లెవల్లో కార్యకర్తలు, జనాలు మాత్రం నాగార్జునను యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా బొత్స లాంటి బలమైన నాయకుడి ముందు, నాగార్జున తేలిపోయారు. అయితే ఓడిపోయినంత మాత్రాన తనకెలాంటి బాధాలేదని నాగార్జున తమ కార్యకర్తలతో అన్నారట. ఇదొక అనుభవమని, వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని రంగంలోకి దిగుతానని ధైర్యం నూరిపోశారట. మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి సెంటిమెంట్‌ ప్రూవ్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో తాను సెంటిమెంట్ వర్కౌట్ చేస్తానంటున్నారు కిమిడి నాగార్జున. చూడాలి చీపురుపల్లి నమ్మకం ప్రతిసారి నిజమవుతుందో, రివర్స్ అవుతుందో?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories