వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

CBI Aggressive In Viveka Murder Case
x

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

Highlights

* నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో నేడు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సీబీఐ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. మొదట 24న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో విచారణకు హాజరుకాలేనని అవినాష్ తెలిపారు. దీంతో ఇవాళ విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది సీబీఐ.

ఈ కేసును దాదాపు రెండున్నరేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అవినాష్‌ను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత విచారణ మొదలుపెట్టిన సీబీఐ అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలన్న వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లో విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు జరగబోతాయనే ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించి వదిలేస్తుందా? లేదా అనే టెన్షన్ నెలకొంది. వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని వివేకా కుమార్తె సునీత రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు వీలు దొరికినప్పుడల్లా వివేకా హత్య కేసుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే కావాలనే ఈ కేసును రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories