Top
logo

ఆర్థర్‌-బైరెడ్డి కోల్డ్‌వార్‌లో కొత్త మలుపేంటి?

ఆర్థర్‌-బైరెడ్డి కోల్డ్‌వార్‌లో కొత్త మలుపేంటి?MLA Arthur, byreddy siddharth reddy
Highlights

ఇద్దరూ ఒకే పార్టీనే. కానీ పచ్చగడ్డి వేసినా, వేయకున్నా భగ్గుమంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీని సమన్వయం...

ఇద్దరూ ఒకే పార్టీనే. కానీ పచ్చగడ్డి వేసినా, వేయకున్నా భగ్గుమంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీని సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లో పార్టీని బలోపేతం చెయ్యాలని, హైకమాండ్ ఆదేశిస్తే, ఎవరికివారు శక్తిమాన్‌లా చెలరేగిపోయేందుకు కయ్యమంటున్నారు ఆ ఇద్దరు లీడర్లు. ఈ పేటకు నేనే మేస్ట్రీని అంటూ, మీసం మెలేస్తున్నారు. ఈ ఇద్దరి కోల్డ్‌వార్‌ అంతకంతకూ పెరుగుతూ, అధిష్టానానికి బీపీ పెంచుతోంది.

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గం పై పట్టు సాధిస్తున్నారా?? వైసిపి అధిష్టానం సైతం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలకు నిలుస్తోందా?? తాజా రాజకీయ పరిస్థితులపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్ తీవ్ర మనస్తాపం చెందుతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయాలు స్థానిక సంస్థల సమరం నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గం పై పూర్తి పట్టు సాధించి అంతా తానే ముందుండి నడిపిస్తున్న సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ నేతల్లో ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలు నీళ్ళలా కలిసిపోయి, పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేసిన కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త సిద్ధార్థ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమను నమ్ముకున్న కార్యకర్తలకు, అనుచరులకు అన్యాయం జరుగుతోందంటూ ఇద్దరు నేతలు అధిష్టానం దగ్గర మరోసారి పంచాయతీ పెట్టారు. అయితే మొదటి నుంచీ ఎమ్మెల్యేకు పెద్ద పీట వేస్తూ ఆయన మాటకు విలువ ఇచ్చిన పార్టీ పెద్దలు, స్థానిక సంస్థల ఎన్నికలకొచ్చేసరికి షాకిచ్చారట. అభ్యర్థుల ఎంపిక మొదలు, లోకల్‌ ఎలక్షన్స్‌ వ్యూహాల వరకూ పూర్తి ఆధిపత్యం నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కట్టబెట్టారట. అదే ఆర్థర్ వర్గం ఆగ్రహానికి కారణమట. తక్కువ కులం అయినందుకు అవకాశాలు ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే వర్గం నేతలు.

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌పై పంతం నెగ్గించుకున్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటిసి సీట్లను తనవర్గానికి దక్కించుకున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ కేవలం రెండు మండలాలతో సరిపెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలోనూ లేనివిధంగా తమ నియోజకవర్గంలో దళితులను ఇబ్బందులు పెడుతున్నారని రగిలిపోయారట ఆర్థర్.

నందికొట్కూరు నియోజకవర్గంలో రెండు మండలాలే చాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్ నిర్ణయించుకున్నారు. 20 రోజులుగా జడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాల విషయంలో ఎమ్మెల్యేకు, ఇన్ చార్జీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య వివాదం సాగుతూనే వుంది. దీనిపై పలుమార్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాలకు సంబంధించి తన వర్గం అభ్యర్థులకు మూడు మండలాల్లో బీ ఫారాలు కావాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేశారు. అయితే సిద్ధార్థరెడ్డి రెండు మండలాలు మాత్రమే ఇచ్చేలా అధినాయకత్వంతో గట్టిగా చెప్పించారు. పాములపాడు, జూపాడుబంగ్లా రెండు మండలాలతోనే ఎమ్మెల్యే సరిపెట్టుకోవాలని పార్టీ పెద్దలు సూచించారు. దీంతో ఆర్థర్ ఆశలు ఆవిరైపోయాయి.

ఎమ్మెల్యే మూడు మండలాలు అడిగినా రెండు మండలాలు ఇచ్చేలా వైసీపీ పెద్దలతో చెప్పించడంలో తన మాట నెగ్గించుకున్నారు సిద్ధార్థ రెడ్డి. అయినా ఎమ్మెల్యే ఆర్థర్ వినకపోవడంతో కర్నూల్లోని ఓ హోటల్‌లో పంచాయతీ పెట్టారు. సిద్ధార్థరెడ్డి వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపడంతో ఎమ్మెల్యే ఓ మెట్టు దిగి రెండు మండలాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొంతకాలంగా నియోజకవర్గ సమన్వయకర్తతో దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే ఆర్థర్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో వెనక్కి తగ్గినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో తనను, తన వర్గాన్ని అణగదొక్కేందుకు ఐజయ్యను పార్టీలోకి ఆహ్వానించి కుట్రలు పన్నారని ఎమ్మెల్యే ఆర్థర్ లోలోపల కుమిలిపోతున్నారట. ఎక్కడాలేనివిధంగా నందికొట్కూరులో రాజ్యంగ హక్కులను ఓ సామాజికవర్గం కాలరాస్తోందని, నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆర్థర్ తన అనుచరులతో ఆవేదనవ్యక్తం చేశారట. మొత్తానికి స్థానిక ఎన్నికల టైంలో, మరోసారి ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానం పెద్దలు వీరి కోల్డ్‌వార్‌కు ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.Web Titlebyreddy siddharth reddy vs MLA Arthur in Nandikotkuru
Next Story


లైవ్ టీవి