విజయనగరం జిల్లాలో బొత్సపై గుర్రుమంటోంది ఎవరు?

విజయనగరం జిల్లాలో బొత్సపై గుర్రుమంటోంది ఎవరు?
x
Highlights

ఆ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో, ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ నేత వద్దకు వెళ్ళాల్సిందే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమున్నా, ఆయనకు విన్నవించుకోవాల్సిందే....

ఆ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో, ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ నేత వద్దకు వెళ్ళాల్సిందే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమున్నా, ఆయనకు విన్నవించుకోవాల్సిందే. నియోజకవర్గం దాటినా పర్వాలేదు కానీ, జిల్లా దాటి ఏ ఫిర్యాదు కూడా అమరావతి చేరడానికి వీళ్లేదంతే. ఎందుకంటే ఆయన అక్కడున్నాడు ఆయన వింటాడు. పరిష్కరిస్తాడు. కానీ అన్ని సమస్యలూ పరిష్కరిస్తున్న ఆ నాయకుడిపైనే, ఇప్పుడందరూ, గ్రూపులు కట్టి మరీ వ్యతిరేక పావులు కదుపుతున్నారట. అయినా వారందర్నీ దారిలోకి తెచ్చేందుకు, సామదాన దండోపాయలు ప్రయోగిస్తున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరా లీడర్.

బొత్స సత్యనారాయణ. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రి. సమస్య ఏదైనా, బొత్స రంగంలోకి దిగారంటే, అది క్లియర్ కావాల్సిందే ట్రబుల్ షూటర్‌గా జగన్ ప్రభుత్వంలో పేరు తెచ్చుకున్నారు బొత్స. అయితే, సొంత జిల్లాలో అసంతృప్తి రగలడంతో సతమతమైపోయారట బొత్స సత్యనారాయణ. కానీ ఆ అసమ్మతులను, అసంతృప్తులను వెనువెంటనే దారిలోకి తేవడంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారట బొత్స.

2019 ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు తొమ్మిది స్థానాలు సాధించిన వైసిపికి, విజయనగరం జిల్లా కంచుకోటగా మారింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ. ఆయన రాజకీయ చతురతతో జిల్లాలోని మహా మహులైన నాయకులను సైతం మట్టికరిపించి వైసిపి అభ్యర్థుల గెలుపుకు కారణమయ్యారు. అప్పటివరకు వర్గపోరుతో సతమతమౌతున్న వైసిపిలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ గెలుపుకు కష్టపడాలని ఆదేశించడంతో, జిల్లాలోని ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి, పార్టీ నిర్ణయించిన అభ్యర్దులు గెలుపొందేలా కృషి చేశారని పేరు తెచ్చుకున్నారు బొత్స.

జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో, పార్టీకి చెందిన ముఖ్య నాయుకులకు, ఎంఎల్ఎల మద్య సమన్వయం లేక గతకొన్ని రోజులుగా మళ్ళీ వర్గపోరు మొదలైందట. దీంతో ఎవరికి వారే అన్న చందగా పార్టీ నాయకులు తయారయ్యారట. ఓ నియోజకవర్గంలో వర్గపోరుతో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరడంతో, ఈ పంచాయితీ పార్టీ అధినేతకు చేరెందుకు సిద్దమయ్యిందట. ఆ విషయాన్ని తెలుసుకున్న మంత్రి బొత్స సత్యన్నారాయణ, రంగప్రవేశం చేసి ఆ నియోజకవర్గంలోని నాయకులందర్నీ ఏకతాటిపైకి వచ్చేలా చర్యలు చేపట్టారట.

విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలు ఉండగా, అందులో ఆరు స్థానాల్లో తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు టిక్కెట్లు సాధించి వారందరూ గెలుపొందేలా చేసుకున్నారు బొత్స. అప్పటి వరకు పార్టీని నమ్ముకున్నవారికి టిక్కెట్లు రాకపోవడంతో, వారంతా నిరాశలో కూరుకుపోయారు. అయితే వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చి, ఒప్పించడంలోనూ నాడు సక్సెస్ అయ్యారు బొత్స. అయితే ఎన్నికల అనంతరం సీన్‌ మళ్లీ రివర్సయ్యిందట.

ఈమధ్య వాలంటీర్ల నియామకాల్లో తమ వారినే నియమించాలని, స్థానిక ఎంఎల్ఎ మాటను సైతం కాదని తమవారికే నియామకం చేపట్టాలని జిల్లాలోని ముఖ్య నాయుకులు పట్టు పట్టడంతో, గొడవలు పెరిగాయి. జిల్లాలోని ఒకరిద్దరు ఎంఎల్ఎలు కొన్ని నెలలుగా బొత్సకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారట. అందరూ కలిసి బొత్స వ్యతిరేకవర్గంగా ఏర్పడేందుకు ట్రై చేశారట. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న బొత్స, జిల్లా నేతలతో, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం జరిపి, వారివారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కొరకు సూచనలు ఇవ్వడంతో గ్రూపు రాజకీయాలకు తెరపడిందట. విజయనగరం జిల్లాలో వైసిపికి పెద్ద దిక్కుగా ఉంటూ ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కారం చేస్తూ అందర్నీ ఏకతాటిపైకి తెస్తూ జిల్లా వైసిపికి తానే నాయకుడై నడిపిస్తున్నారు బొత్స. అయితే బొత్స తన చాణక్యంతో, తన వ్యతిరేక గ్రూపులను కంట్రోల్‌లో పెడుతున్నా, ఎంతకాలం నివురుగప్పిన నిప్పును దాస్తారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories