Botsa Satyanarayana: బడ్జెట్ అంకెల గారడీ.. అప్పుల లెక్కలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Updated on: 14 Feb 2026 5:22 PM IST
Botsa Satyanarayana: బడ్జెట్ అంకెల గారడీ.. అప్పుల లెక్కలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది
X

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్ ప్రజలను వంచించేలా ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. బడ్జెట్ ప్రసంగం అంతా 'ఆత్మస్తుతి.. పరనింద' అన్న చందంగా సాగిందని ఎద్దేవా చేశారు.

మహిళా సాధికారతపై వంచన!

ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై బొత్స మండిపడ్డారు. "గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పథకంతో డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేవి. కానీ ఈ 19 నెలల్లో సున్నా వడ్డీ పథకం ఏమైందో ఎవరికీ తెలియదు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా మారుస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.

ఉపాధి హామీ నిధుల్లో కోత

గ్రామీణాభివృద్ధికి వెన్నెముక లాంటి ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల విషయంలో ప్రభుత్వం కోత పెట్టిందని బొత్స ఆరోపించారు. కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రం భరించాల్సిన 40 శాతం వాటా కింద రూ. 2,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే చూపించారని విమర్శించారు. మిగిలిన నిధుల సంగతేంటని, ఈ పథకాన్ని నీరుగార్చడమే ప్రభుత్వ ఉద్దేశమా అని నిలదీశారు.

అప్పుల లెక్కలపై వాగ్వాదం

రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని బొత్స దుయ్యబట్టారు.

"మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే."

"గత టీడీపీ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్ల అప్పు చేసింది."

వాస్తవాలు ఇలా ఉంటే, ఏకంగా రూ. 9.46 లక్షల కోట్ల అప్పులు మా వల్లే వచ్చాయని చెప్పడం సత్యదూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ కేవలం పవన్, లోకేశ్, చంద్రబాబుల పేర్ల జపం తప్ప సామాన్యులకు ఇచ్చే భరోసా ఏమీ లేదని ఆయన అభివర్ణించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story