కరువు జిల్లాపై కమలం గాలం.. ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కేదెవరు?

కరువు జిల్లాపై కమలం గాలం.. ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కేదెవరు?
x
Highlights

ఔను...కన్నడ సీమ నుంచి రాయలసీమకు కాషాయ గాలి వీచకపోతుందా కమలం వికసించకపోతుందా కరవు జిల్లాలో కరవుతీరా బీజేపీకి సీట్ల వర్షం కురవకపోతుందా ఇదీ...

ఔను...కన్నడ సీమ నుంచి రాయలసీమకు కాషాయ గాలి వీచకపోతుందా కమలం వికసించకపోతుందా కరవు జిల్లాలో కరవుతీరా బీజేపీకి సీట్ల వర్షం కురవకపోతుందా ఇదీ ఏపీ కాషాయ నేతల అనంత ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు. అందుకే ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది కమలం. మరి కాషాయ ఇంద్రజాలానికి, నేతలు ఆకర్షితులవుతారా? కమలం కండువా కప్పుకుంటారా? అనంతపురంలో అసలేంటి బీజేపీ స్ట్రాటజీ?

రాయలసీమ జిల్లాల్లో కీలకమైన అనంతపురం పై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులతో మంతనాలు సాగిస్తోంది. జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉందన్న ప్రచారంతో బేరసారాలు సాగిస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తోన్న పక్క రాష్ట్రానికి చెందిన నేతలు ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. బీజేపీ లోకి చేరడానికి ఆయా పార్టీల నేతలు లాభనష్టాలపై బేరీజు వేసుకంటున్నట్లు సమాచారం. రాబోవు ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోందన్నది స్పష్టమవుతోంది. అనంతలో ఏం జరుగుతోంది. కమలానికి ఏఏ నేతలు ఆకర్షితులవుతున్నారు. వాచ్ దీస్ స్టోరీ.

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వెయ్యాలని రకరకాల ఎత్తులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ, జిల్లాల వారీగా స్ట్రాటజీలు అప్లై చేస్తోంది. కర్ణాటకలో అధికారంలో వుండటంతో, దాని సరిహద్దు జిల్లాలపై దృష్టిపెట్టింది. అనంతపురంలో ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఆ పార్టీనేతలు, జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై గాలం వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేతో కమలం పార్టీ నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీలో ఉన్న కొందరు ప్రముఖుల చూపు బీజేపీపై పడింది. అధికార పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన పలువురు, కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, వైసీపీ నేత వజ్రభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకుడు దేవానంద్ సహా పలువురు గులాబీ గూడికి చేరారు. క్షేత్రస్థాయిలో వారి అనుయాయులు, ఇతర పార్టీల్లో గ్రామాల్లో కీలకంగా ఉన్న నేతలను, తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ పెద్దలు అనంతలో మాజీ, తాజా ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు.

ఓ మాజీ ఎమ్మెల్యేతోనూ సదరు నేతలు పార్టీ మారడంపై చర్చించారు. అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలపై, ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారడానికి సన్నద్ధమైన నేపథ్యంలో, సదరు మాజీ, బీజీపీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ముహూర్తం చూసుకుని త్వరలోనే పార్టీ మారడం ఖాయమని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారనున్నాయని, పలువురు ప్రముఖులు తమ పార్టీలోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే అధికారపార్టీ ఒత్తిడి భరించలేక ఇప్పటికే పార్టీ మారడానికి సిద్ధమయ్యారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నా, ఇటీవల బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన దూత, సదరు నేతతో సుదీర్ఘంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటక నుంచి కాషాయ గాలి వీస్తున్న సరిహద్దు నియోజకవర్గాలను మొదట ఒడిసిపట్టాలన్నది కాషాయ స్ట్రాటజీగా అర్థమవుతోంది. చూడాలి కమలం గాలానికి ఏపార్టీ నేతలు, ఎందరు ఆకర్షితులవుతారో, బీజేపీ బలోపేతానికి, ఆ పార్టీ చేపట్టిన ఆపరేషన్ కమల్ ఏమేరకు సఫలమవుతుందో. లెట్స్ వెయిట్ సమ్‌ టైమ్.Show Full Article
Print Article
Next Story
More Stories