కళాపై కాషాయం కన్నేసిందా?

కళాపై కాషాయం కన్నేసిందా?
x
Highlights

ఆయన పేరు కళ. అధ్యక్ష పీఠంతో ఒకప్పుడు కళకళ. ఇప్పుడా కుర్చీ దిగాక అంతా వెలవెల. అందుకే ఆయనపై ఓ పార్టీ వేస్తోందట వల. రైమింగ్‌ అదిరిపోయిందా ఆయన టైమింగ్‌...

ఆయన పేరు కళ. అధ్యక్ష పీఠంతో ఒకప్పుడు కళకళ. ఇప్పుడా కుర్చీ దిగాక అంతా వెలవెల. అందుకే ఆయనపై ఓ పార్టీ వేస్తోందట వల. రైమింగ్‌ అదిరిపోయిందా ఆయన టైమింగ్‌ కూడా అలానే వుందట. ఇంతకీ ఎవరా కళ....ఏంటా వల?

కిమిడి కళా వెంకట రావు. మాజీ మంత్రి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు. మొన్నటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన లీడర్. ఎప్పుడైతే పెద్ద కుర్చీ పొయ్యిందో, నాటి నుంచే కళా వెంకటరావులో కళ తప్పింది. టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా వెలవెలబోతూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారట కళ. దీంతో ఆయనపై రకరకాల ప్రచారం పచార్లు కొడుతోంది.

అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పీఠం అప్పగించడం, కళా వెంటక రావుకు ఏమాత్రం నచ్చలేదట. తనను మరోసారి రెన్యువల్ చేస్తారనుకుంటే, చంద్రబాబు మాత్రం పక్కనపెట్టారని రగిలిపోతున్నారట కళా వెంకట్రావు. ఇలా కుమిలిపోతున్న కళా వెంకటరావుపై కమలం కన్నేసిందన్న ప్రచారం జోరందుకుంది. తాజాగా కళా కుటుంబ సభ్యులతో కాషాయ నేతలు సమావేశమవ్వడంతో, ఇందుకు మరింత స్కోప్‌‌ వస్తోంది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టున్న కిమిడి కుటుంబాన్ని తమవైపు లాగేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోందట బీజేపీ. తాజాగా కిమిడి కుటుంబ సభ్యులతో భారతీయ జనతా పార్టీ నేతలు భేటి అయ్యారట. బిజెపి నేత, ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబురావు, బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావనితో కలిసి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలసలోని, కిమిడి రామకృష్ణంనాయుడుతో చర్చలు జరిపారట. కిమిడి రామకృష్ణంనాయుడు, కళా వెంకట రావు సోదరుడు. కళాతో పాటు కుటుంబ సభ్యులందరూ తమ పార్టీలో చేరాలని, ఆ ఫ్యామిలీని ఆహ్వానించారట. ఈ సమావేశ జరుగుతున్న టైంలో, కళా వెంకట రావు మరో ఊర్లో వున్నారట. ఈ విషయం కళా వెంకట రావుకు చేరవెయ్యాలని, బీజేపీ ప్రతినిధులు చెప్పారట. ఆయనకు కమలంలో సముచితమైనత స్థానం ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. అత్యంత రహస్యంగా సాగిన ఈ సమావేశం, శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది.

బిజెపి నేతలు కిమిడి కుటుంబాన్ని కలిసిన విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ చర్చలు సాగుతున్న సమయంలో, మాజీ మంత్రి, టిడిపి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున ఇదే విషయమై రామకృష్ణనాయుడుని అడిగారట. ఏదో వచ్చారు, ఎందుకు నీకు, చిన్నవాడివి అంటూ మాట దాట వేసే ప్రయత్నం చేశారట. గతంలో కళా వెంకట రావు, ప్రజారాజ్యంలో చేరే ముందు కూడా, సరిగ్గా ఇలాంటి డ్రామానే నడిచిందట.

కిమిడి కళా వెంకట రావుకు గాలం వెయ్యడం వెనక, బీజేపీ చాలా పెద్ద వ్యూహమే వుందన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కిమిడి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆ కుటంబం తెలియని వారుండరు. ఆ ఫ్యామిలీలో కిమిడి కళా వెంకటరావు రాష్ట్ర మంత్రిగా, శాససభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కూడా పని చేసారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. అలాగే ఆయన సోదరుడు కిమిడి గణపతిరావు శ్రీకాకుళం జిల్లాలోని ఉణుకూరు ఎమ్మెల్యేగా పని చేసారు. అదే కుటుంబానికి చెందిన కిమిడి మృణాళిని, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేయగా, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. అలాగే కిమిడి కుటుంబం నుంచి రామకృష్ణం నాయుడు ఎం.పి.పిగా, జడ్పీటిసిగా కూడా చేసారు. ఇలా ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో, కళా వెంటక రావు ఫ్యామిలీకి మంచి పట్టుంది. అందుకే బీజేపీ నేతలు, కళపై ఎక్కువగా దృష్టిపెట్టారట.

ఒకవైపు టీడీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అసహనంతో వున్నారట కళా వెంకటరావు. దీనితో పాటు ఎచ్చెర్ల, రాజాంలో పరిస్థితులు తలకిందులవుతున్నాయట. అనుచరులు, పార్టీ కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లడంతో, ఎటూ కదల్లేని పరిస్థితి. అన్నింటికి మించి చంద్రబాబు తనను పక్కనపెట్టారన్న ఆవేదనే ఆయనలో ఎక్కువగా వుందని, కళా సన్నిహితులంటున్నారు. కళా అసంతృప్తిపై కన్నేసిన కమలం, ఇదే అదనుగా తమవైపు లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందట. కొంతమంది అనుచరులు కూడా, ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కళా వెంకటరావు మాత్రం, పార్టీ మార్పుకు అంత సుముఖంగా లేరట. టీడీపీతో తన బంధం పెనవేసుకుపోయిందని అంటున్నారట. ఇప్పటికైతే తనకు పార్టీ మారే ఆలోచన లేదట. కానీ కమలం నేతలు మాత్రం తమ ట్రయల్స్ ఆపడం లేదు. రోజూ చెబుతూ వుంటే, ఏదో ఒక రోజు, కాషాయ కండువా కప్పుకుంటారన్న ఆశతో, ప్రయత్నాలు చేస్తున్నారట. చూడాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories