జనసేన-కమలం జోడి కుదిరిందా.. త్వరలో ఏపీలో బీజేపీ-జనసేనలకు సంబంధించి కీలక..

జనసేన-కమలం జోడి కుదిరిందా.. త్వరలో ఏపీలో బీజేపీ-జనసేనలకు సంబంధించి కీలక..
x
జనసేన-కమలం జోడి కుదిరిందా
Highlights

ఔను. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. మరోసారి ఆరెస్సెస్‌ లీడర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనేతలతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఇంతకీ...

ఔను. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. మరోసారి ఆరెస్సెస్‌ లీడర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనేతలతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ అదేపనిగా హస్తిన వెళ్లడం, బీజేపీ పెద్దలను కలవడంలో ఆంతర్యమేంటి? చంద్రబాబుతో కలిసి సాగితే కష్టమని భావిస్తున్నారా అందుకే కాషాయ జట్టుతో జట్టు కట్టాలని డిసైడయ్యారా? అతి త్వరలో ఏపీలో బీజేపీ-జనసేనలకు సంబంధించి కీలక రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయా?

ఢిల్లీలో కాషాయ పెద్దలతో జనసేనాని సమావేశం దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల్లో పొత్తుల వరకే చర్చలు పరిమితమా? లేదంటే కాషాయంలో జనసేన విలీనంపైనా మాట్లాడుకున్నారా? 3 రాజధానుల రణక్షేత్రం టైంలో వీరి భేటి ఇస్తున్న సిగ్నల్స్ ఏంటి? పవన్‌ను కమలం రారమ్మంటోందా? పవనే వస్తా నీ వెనకా అంటున్నారా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఢిల్లీలో బీజేపీ, ఆరెస్సెస్‌ అగ్రనాయకులను కలవడం, రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఈ వరుస సమావేశాలు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆదివారం ఆరెస్సెస్‌ నాయకులను కలిశారు. సోమవారం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగత్ ప్రకాష్ నడ్డాను, ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అదే సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా నడ్డా నివాసంలో ఉన్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వి.మురళీధరన్‌‌, కో ఇన్‌చార్జ్‌ డియోడర్‌ను సైతం కలిశారు. ఇలా అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ అగ్రనేతలను పవన్ బృందం కలుస్తుండటం, సుదీర్ఘంగా మంతనాలు సాగుతుండటం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది.

పవన్‌ బీజేపీ అగ్రనేతలను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మార్పుపై రైతులు, ప్రజల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఆయన బీజేపీ పెద్దలను కలిశారని, రాజధాని మార్చకుండా జగన్‌ సర్కారును కట్టడి చేయాలని కోరారన్న మాటలు వినపడుతున్నాయి. అయితే, రాజధాని విషయం, ఒక అంశంగా మాట్లాడుకున్నా, అసలుసిసలు చర్చలు వేరే వున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కలిసి నడిచేందుకు బీజేపీ, జనసేనలు చేయిచేయి కలుపుతున్నాయన్న వార్తలు హస్తినలో చక్కర్లు కొడుతున్నాయి. ఆందోళనలు, నిరసనలు, కొన్ని విధానపరమైన విషయాల్లో కలిసి పని చేయడంతో పాటు, భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసేలా ఇద్దరి మధ్యా సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా పొత్తుకు బీజేపీ తొందరపడుతోందా జనసేన అధినేత ఉవ్విళ్లూరుతున్నా అన్నది కూడా కీలకమే అయినా, పరస్పర ప్రయోజనాలు, అవసరాల ప్రతిపాదికగానే, ఇద్దరి మధ్యా పొత్తు పొడుస్తోందన్న మాటలు వినపడుతున్నాయి.

2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై విభేదించి, టీడీపీ మాదిరే కాషాయానికి దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న పవన్, పొత్తుల్లేకపోతే కష్టమని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలుగుదేశంతో ఫ్రెండ్‌షిప్‌ రాజకీయాలు చేస్తున్నట్టు ముందుకెళ్లారు. ఇసుకతో పాటు కొన్ని అంశాలతో టీడీపీ, జనసేనలు కలిసి కదంతొక్కాయి కూడా. అయితే, చంద్రబాబుతో కలిసి వెళితే, ఏపీలో జనసేన బలపడటం కష్టమని, ఆశించిన మైలేజ్ రావడంలేదని భావిస్తున్న పవన్, కాషాయ చెంతకు చేరడమే మేలని అనుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీ నడపడానికి అవసరమైన వసతులు, నిధులు కూడా లేవని బాధడుతున్న పవన్, కాషాయ చెంతకు చేరితే, అటు కేంద్ర ప్రభుత్వం అండతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ సహకారమూ కూడా లభిస్తుందని ఆలోచిస్తున్నారట. అందుకే కొంతకాలం కిందట, తాను ఎప్పుడూ బీజేపీకి దూరంగా జరగలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీకెళ్లి రహస్యంగా బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి హస్తినవెళ్లి చర్చించారు. బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దమని చెప్పినందుకే, కాషాయ నేతలు పవన్‌ను ఆహ్వానించారని, అందుకే హుటాహుటిన హస్తినవెళ్లి, నడ్డాతో పాటు కీ లీడర్లను కలిశారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీతో కలిసి సాగేందుకు సిద్దమని చెప్పిన పవన్, అందుకు కొన్ని అంశాలపై క్లారిటీ కావాలని వారిని అడిగారని తెలుస్తోంది.

జగన్‌ ప్రభుత్వంపై బీజేపీ అభిప్రాయమేంటి? రాజధాని మార్పును వ్యతిరేకిస్తోందా..లేదా? జగన్‌ సర్కారుతో ఫ్రెం‌ఢ్లీ ఫైటింగా? లేదంటే దూకుడుగా వెళ్లేందుకు సిద్దమా? ముందు వీటిపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ముందు పవన్‌ ప్రతిపాదన?

ఈ ప్రశ్నలపై స్పష్టత వచ్చాకే, బీజేపీతో కలిసి పనిచేయడంపై ఆలోచిస్తామని పవన్ కల్యాణ్, కాషాయ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. కిందిస్థాయి నాయకత్వంతో ప్రాథమిక చర్చలు ఫలప్రదం అయ్యాక, మోడీ, అమిత్‌ షాలను పవన్‌ కలుస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నింటికీ జేపీ నడ్డా ఓకే అన్నట్టు సమాచారం. ఏపీలో బలపడేందుకు తాము సిద్దంగా వున్నామని, ఇప్పటికే రాజధానితో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు కొనసాగిస్తున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన, బీజేపీల పొత్తుపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు సమాచారం. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనే కలిసి పోటీ చేస్తారా లేదంటే ఆందోళనలు ఉమ్మడిగా చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటారా అన్నది త్వరలోనే తేలిపోతుంది. మొత్తానికి ఏపీలో వైసీపీ ఒకవైపు, టీడీపీ మరోవైపు, బీజేపీ, జనసేనలు ఇంకోవైపు అన్నట్టుగా త్రిముఖ సమరానికి అంతా సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీలో క్షేత్రస్థాయిలో బలపడటం జనసేనకే కాదు, బీజేపీకి కూడా ముఖ్యమే. అందుకే పాపులర్‌ నాయకులు ఎవరు వచ్చినా, మాట్లాడేందుకు, తమలో కలుపుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మొన్న మోహన్‌ బాబునూ అందుకే ఢిల్లీకి పిలిపించుకుందని తెలుస్తోంది. ఏపీలో మోహన్‌ బాబు పాపులర్‌ యాక్టరే కాదు, కమ్మ సామాజికవర్గం కూడా. కాపు వర్గంలో కీలకమైన నాయకుడైన పవన్‌ను కూడా ఆకర్షిస్తే, తమకు వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తోంది బీజేపీ. అందుకే జనసేనను తమ పార్టీలో విలీనం చెయ్యాలని గతంలో ప్రతిపాదించిన బీజేపీ, అది కుదరకపోవడంతో, కనీసం పొత్తులతోనైనా ముందుకెళ్లాలనుకుంటోంది. దానిలో భాగంగానే పవన్‌ను ఢిల్లీకి రావాలని ఆహ్వానించిందన్న సమాచారం అందుతోంది.

అయితే, టీడీపీతో కలిసి సాగితే మైలేజ్‌ రాదని భావిస్తున్న పవన్, బీజేపీతో కలిసి మూడో శక్తిగా ఎదగాలని భావిస్తున్నారా అందుకే హస్తినలో ఈ చర్చలా అంటూ ఒకవైపు డిస్కషన్ జరుగుతుంటే, మరోవైపు చంద్రబాబు ఆలోచన లేకుండా, పవన్‌, ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశమే లేదన్న మాటలూ వినపడుతున్నాయి రాజధాని అమరావతిలోనే వుండాలంటే కేంద్రమే కీలకమని భావిస్తున్న బాబు, అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తున్న క్రమంలో, పవన్‌ను హస్తినకు పంపారన్న చర్చ జరుగుతోంది. అంటే, పవన్‌ బీజేపీ లీడర్లను కలవడం వెనక చంద్రబాబు వ్యూహమూ దాగుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఏపీలో బలపడేందుకు ఆపసోపాలు పడుతున్న బీజేపీ, జనసేనలు జాయింట్‌గా పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. త్వరలో మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా లేదంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి సిద్దమవుతారా రెండూ లేదంటే బీజేపీ ఎంపీ జీవీఎల్‌ ప్రతిపాదించినట్టు కాషాయదళంలో జనసేనను పవన్‌ విలీనం చేస్తారా అన్న ప్రశ్నలపై ఎవరికి ఆలోచనను బట్టి వారు అంచనా వేసుకుంటున్నారు. కొంతకాలంగా పవన్‌ భాషలో కాషాయ భావాలు స్ఫురిస్తుండటం, హిందూదర్మం, తిరుమల, మతమార్పిడుల వంటి భావజాల ప్రయోగం బీజేపీని ఆకర్షించేందుకే అన్న చర్చ ఎలాగూ వుంది. అందుకే త్వరలో ఏపీలో బీజేపీ-జనసేనలకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయని రాజకీయవర్గాల్లో హాట్‌హాట్‌గా డిస్కషన్‌ సాగుతోంది. చూడాలి, అదెలాంటి పరిణామమో, పవన్‌కు, బీజేపీకి అదెలాంటి టర్నింగ్‌ అవుతుందో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories