ఆ యంగ్‌ లీడర్ల వార్‌ మళ్లీ మొదలైందా?

ఆ యంగ్‌ లీడర్ల వార్‌ మళ్లీ మొదలైందా?
x
Highlights

చూడు ఒకవైపే చూడు. రెండో వైపు చూడొద్దు కాలువ గట్టు తెగి ఊరిమిద పడతది. ఇలా బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలా వుంది, కర్నూలు జిల్లాలో ఇద్దరు యువ నాయకుల...

చూడు ఒకవైపే చూడు. రెండో వైపు చూడొద్దు కాలువ గట్టు తెగి ఊరిమిద పడతది. ఇలా బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలా వుంది, కర్నూలు జిల్లాలో ఇద్దరు యువ నాయకుల పొలిటికల్‌ వార్. కాలువ తెగి, పట్టణాన్ని ముంచెత్తుతోందని మాజీ ఎమ్మెల్యే కళ్లెర్రజేస్తుంటే, గట్టు మీద ఒట్టు, ఆ పాపం మీదేనంటూ తాజా ఎమ్మెల్యే రుసరుసలాడుతున్నారు. ఇంతకీ ఎవరా యంగ్‌ లీడర్స్?

భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే. శిల్పా రవిచంద్రారెడ్డి తాజా ఎమ్మెల్యే. ఈ ఇద్దరు యువ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లుతోంది నంద్యాల. అభివృద్ధికి తామే ప్రతీక అంటూ ఒకరు, కాదు అవినీతికి అంటూ మరొకరు పంచ్‌ డైలాగులు పేలుస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఎవరి హయాంలో ఏం జరిగిందో తేలుద్దామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా వీరి నడుమ అగ్గిరాజేసింది నంద్యాలలోని ఓ చెక్‌ డ్యాం.

చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది వరుణుడు జిల్లాను గట్టిగానే పలకరించాడు. ముఖ్యంగా నంద్యాల డివిజన్‌లో, ఈసారి కురిసిన అధిక వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేల ఎకరాల పంట నీట మునిగాయి. అనేక కాలనీలు జలమయమయ్యాయి. నీటిని సరఫరా చేసే కాలువలు వాటి ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక తెగిపోయాయి. దీంతో నంద్యాలలో జనజీవనం పూర్తిగా రెండు మూడు రోజులపాటు అస్తవ్యస్తంగా తయారైంది. ఊహించని వరదనీటితో ఇబ్బందిపడ్డ స్థానిక ప్రజలకు, భరోసా కల్పించేందుకు, ధైర్యం చెప్పేందుకు కాస్త ఆలస్యంగానైనా తాజా, మాజీ ఎమ్మెల్యేలు వారివారి ప్రాంతాల్లో పర్యటించారు. తమ ప్రాంతానికి వచ్చిన నేతలతో స్థానికులు తమ ఆవేదనను వెళ్ళబోసుకున్నారు. ప్రజల మాటలు విన్న నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణల రచ్చకు దిగారు.

భూమా నాగిరెడ్డి మరణంతో తెరపైకి వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి, ఒకటిన్నర సంవత్సరం పాటు నంద్యాల శాసన సభ్యునిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు సైతం చేశారు. ఈ క్రమంలోనే వర్షాలు ఎప్పుడు పడినా నంద్యాలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో, ప్రధాన పట్టణంలో వున్న కుందూ-చామ కాలువ కట్టడాన్ని వెడల్పు చేశారు. కేసీ కెనాల్ కట్టను పటిష్ట పరిచారు. ఈ క్రమంలో తాజాగా కురిసిన వర్షాలకు నాణ్యతాలోపం వల్ల తెగిపోయింది కట్ట. దీంతో వరద నీరంతా పట్టణంలోకి రావడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, టిడిపి హయాంలో నాసిరకంగా చేసిన పనుల నిర్మాణంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.

శిల్పా రవి చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. వరద నీటిని నివారించేందుకు చేసిన కార్యక్రమాలతోనే ఈరోజు నంద్యాలకు మరింత వరద ముప్పు తప్పిందన్నారు. ఎన్నికలు జరిగినా చాలారోజుల తర్వాత తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకోవడంతో, నంద్యాల రాజకీయం ఊహించని విధంగా ఒక్కసారిగా వేడెక్కింది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చలకు రావాలని నేతలిద్దరూ సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. తాజా వివాదం ఎక్కడకు దారి తీస్తుందోనని ఇరు పార్టీల కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories