11 నుంచి‘ అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ యాత్ర

11 నుంచి‘ అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ యాత్ర
x
Highlights

ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిపే ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’ యాత్రలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఏ నేతలకు పిలుపు ఇచ్చారు.

అమరావతి: ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిపే ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’ యాత్రలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఏ నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్... మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ వరకు చేపట్టే ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలని చెప్పారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారని, ఆయన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని చెప్పారు. వాజ్ పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారని, కార్గిల్ యుద్దంతో శత్రువుకు తిరుగులేని సమాధానం చెప్పారని తెలిపారు. వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందన్నారు.

‘‘నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉంది. రాష్ట్రాభివృద్దిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేస్తారు. పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. టెలీ కమ్యునికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ ను చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పట్టుదల, అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారు. నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ వన్ స్థానానికి వెళ్తారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారు. వాజ్‌పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలి. “అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన” కార్యక్రమాన్ని విజయంతం చేయాలి.’’ అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories