డామిట్... వారి కథ నిజంగానే అడ్డం తిరిగింది

డామిట్... వారి కథ నిజంగానే అడ్డం తిరిగింది
x
Highlights

సందు దొరికితే చాలు సమస్తం దోచుకెళ్లే కేటుగాళ్ల ఆగడాలు మరింత శృతి మించుతున్నాయి. ఇక ఆదమరిస్తే అంతే సంగతులు మొత్తం ఊడ్చేసే దుండగుల సంఖ్య కూడా కరోనా...

సందు దొరికితే చాలు సమస్తం దోచుకెళ్లే కేటుగాళ్ల ఆగడాలు మరింత శృతి మించుతున్నాయి. ఇక ఆదమరిస్తే అంతే సంగతులు మొత్తం ఊడ్చేసే దుండగుల సంఖ్య కూడా కరోనా వైరస్ లా వ్యాప్తి చెందుతోంది. తాజాగా వీరి కన్ను ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధిపై పడింది. అయితే పాపం పండటంతో వారి ప్రయత్నం ఫలించక చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. డామిట్... వారి కథ నిజంగానే అడ్డం తిరిగింది.

నకిలీ చెక్కులతో ఏపీ సీఎంఆర్ఎఫ్ కింద సుమారు 117 కోట్ల 13 లక్షల రూపాయలు కాజేయాలన్న ఘటన ఇప్పుడు రాష‌్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతాల్లోని ఎస్ బీ ఐ బ్రాంచులు కేంద్రంగా ఈ మొత్తం డబ్బును కాజేయాలని భావించిన కేటుగాళ్ల ప్లాన్ కు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. సీఎంఆర్ఎఫ్ పేరిట తయారు చేసిన ఈ నకిలీ చెక్కులను క్లియరెన్స్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన దుండగులకు సదరు బ్యాంకు సిబ్బంది షాకిచ్చారు. వెంటనే అధికారులకు చెక్ గురించి సమాచారం ఇచ్చారు. మేం ఎలాంటి చెక్ ఇవ్వలేదు, అంత పెద్ద మొత్తాన్ని అసలు ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం లేదని అధికారులు చెప్పడంతో ఈ కేటుగాళ్ల గుట్టురట్టయ్యింది.

ఒకేసారి మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు చెక్కుల ద్వారా సుమారు 117 కోట్ల రూపాయలు కాజేయాలనుకోవటం సీఎంఓ అధికారులను, సచివాలయ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ నకిలీ చెక్కులు విజయవాడ ఎంజీరోడ్ బ్రాంచ్ అడ్రస్ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ, కోల్ కతా, బెంగుళూరులకు బృందాలుగా వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి కేటుగాళ్ల బండారాన్ని బయటపెట్టే పనిలో పడ్డారు పోలీసులు.

మూడు చెక్కుల ద్వారా 117 కోట్లను కాజేయాలనుకున్న వారంతా ఒక ప్రొఫెషనల్ ముఠాకు చెందినవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 7, 9, 14 తేదీల్లో ఆ చెక్కులు క్లియరెన్స్ కోసం వెళ్లిన నేపథ్యంలో ఈ రెండు వారాల వ్యవధిలో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఈ స్కాం వ్యవహారంపై సీరియస్ గా ఉంది.

ఈ చెక్కుల స్కాం వెలుగు చూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం అలర్టయ్యింది. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో ఆరా తీస్తోంది. అలాగే పేదవారికి వైద్యసాయం అందించేందుకు పొరుగురాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వారికి సైతం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంటే ఈ స్కీంలో స్కాం చేసే ధైర్యం ఎలా వచ్చిందని సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారంలో తెరముందు ఉన్న పాత్రధారులు, తెరవెనుక ఉన్న సూత్రధారుల్ని పట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్ ల స్కాం వెలుగులోకి రావటానికి బెంగుళూరు వేదికైంది. బెంగళూరు సర్కిల్ లోని మంగళూరు మూడ్ బద్రి శాఖకు 52 కోట్ల 65 లక్షల రూపాయల విలువైన చెక్ ను డ్రా చేసేందుకు ఓ వ్యక్తి ఆ బ్రాంచ్ లో సమర్పించాడు. ఇంత పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసే ముందు సంబంధిత విభాగాల్ని సంప్రదించే ప్రక్రియలో భాగంగా వెలగపూడిలోని ఎస్ బీ ఐ బ్రాంచ్ అధికారులను వాకబు చేశారు. అసలు అంత మొత్తంలో తాము ఎప్పుడూ చెక్ ఇవ్వలేదనీ, ఈ చెక్ తో మాకు సంబంధం లేదని చెప్పటంతో బ్యాంక్ సిబ్బంది తమ ప్రాంతీయ కార్యాలయాలను అప్రమత్తం చేశారు.

ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్ బీ ఐ సీసీపీసీ-1 బ్రాంచ్ లో గత శనివారం 39 కోట్ల 85లక్షల 95 వేల 540 రూపాయల విలువైన చెక్ ను సీఎంఆర్ఎఫ్ ఖాతా నుండి డ్రా చేసేందుకు సమర్పించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు సైతం వెలగపూడి ఎస్ బీ ఐ అధికారులను సంప్రదించగా నో అనే సమాధానం రావడంతో ఆ చెక్ ను కూడా అధికారులు నిలుపుదల చేశారు. అలాగే కోల్ కతాలో సైతం సేమ్ సీన్ రిపీటైంది. సుమారు 24 కోట్ల 65 లక్షల రూపాయల విలువైన చెక్ ను క్లియరెన్స్ కోసం ఇవ్వగా అది కూడా నకిలీదేనని వెలగపూడి అధికారులు తేల్చారు. 117 కోట్ల రూపాయల స్కాంను అధికారులు తమ అప్రమత్తతో అడ్డుకోగలిగారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద పొరుగురాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునేందుకు అనుమతులు ఇచ్చిన స్కీంనే స్కాం లా మార్చుకున్నారు కేటుగాళ్లు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్ బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటు ఏపీలో ఓ ఏజెన్సీ, అటు పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల బాధ్యతను మరో ఏజెన్సీలకు అప్పజెప్పిన నేపథ్యంలో ఈ చెక్కులేమైనా ఇలా కూడా బయటకు వెళ్లాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్ఎఫ్ లో పనిచేస్తోన్న ఉన్నతాధికారులు, సిబ్బంది పాత్రపై సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ నకిలీ చెక్కుల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా 117 కోట్ల రూపాయలను హాంఫట్ చేసేందుకు వ్యూహం రచించిన కేటుగాళ్ల ఆగడాలకు తాత్కాలికంగా చెక్ పడింది. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్ ల వ్యవహారం ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నిందితుల అసల రూపం వెలుగులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories