దేవాలయాలపై వరుస దాడుల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

దేవాలయాలపై వరుస దాడుల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
x
Highlights

దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై ఆలయాల్లో పటిష్ట బందోబస్తుకు నడుంబిగించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ సీసీ...

దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై ఆలయాల్లో పటిష్ట బందోబస్తుకు నడుంబిగించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రతీ ఆలయానికి ఓ విశిష్ఠత ఉంటుంది. సాంప్రదాయాల ప్రకారం ఏడాదికోసారి ఉత్సవాలు జరుగుతుంటాయి. అయితే మిగిలిన సమయాల్లో స్వామి, అమ్మవార్లకు సాధారణంగానే పూజలు నిర్వహిస్తుంటారు ఆలయ నిర్వాహకులు. అందుకే ఉత్సవ విగ్రహాలు, రథాలను ఏడాదికోసారి మాత్రమే బయటకు తీస్తుంటారు. దీంతో మిగిలిన సమయాల్లో అవి ఎక్కడున్నాయో..? ఏమయ్యాయో అని ఎవరూ కూడా కన్నెత్తి చూడరు.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్దం కావడం సంచలనం రేపింది. అదే సమయంలో పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం, మరికొన్ని అపహరించడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే దేవాదాయశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ఆలయాలకున్న భద్రతపై ఆరా తీయడం ప్రారంభించారు. అదేవిధంగా ఆలయ సామాగ్రిని భద్రపరించేందుకు తీసుకుంటున్న చర్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.

అటు విశాఖలో చారిత్రాత్మకమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా సింహాచలం, బురుజుపేట కనకమహాలక్ష్మీ, ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం. దీంతో దేవాదాయ శాఖలోని ఉన్నతాధికారులు, పలువురు సిబ్బంది నేరుగా ఆలయాలకు వెళ్లి భద్రతపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రథాలు భద్రపరిచే షెడ్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు జిల్లాలోని ఆలయాల్లో 1400 కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories