శాసన మండలిలో ఫీజు పోరు: వైసీపీ వాకౌట్.. బకాయిల లెక్కలతో కౌంటర్ ఇచ్చిన లోకేష్, డోలా!

శాసన మండలిలో ఫీజు పోరు: వైసీపీ వాకౌట్.. బకాయిల లెక్కలతో కౌంటర్ ఇచ్చిన లోకేష్, డోలా!
x
Highlights

AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల అంశం తీవ్ర దుమారం రేపింది.

AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల అంశం తీవ్ర దుమారం రేపింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా, ప్రభుత్వం గణాంకాలతో వారికి దీటుగా బదులిచ్చింది.

బకాయిలపై వైసీపీ ఆరోపణలు:

రాష్ట్రంలో రూ. 7,800 కోట్ల ఫీజు బకాయిలు ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 1,200 కోట్లు మాత్రమే విడుదల చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న 5 క్వార్టర్ల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు సభను వీడారు.

గత పాపాలను కడుగుతున్నాం: మంత్రుల కౌంటర్

వైసీపీ సభ్యుల విమర్శలను మంత్రులు నారా లోకేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి తీవ్రంగా ఖండించారు.

మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు:

2014-19 మధ్య ఉన్న రూ. 224 కోట్ల బకాయిలను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ నిధులను విడుదల చేశాం.

గత వైసీపీ ప్రభుత్వం రూ. 4,000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయింది. అందులో ఇప్పటికే రూ. 1859.01 కోట్లను మా ప్రభుత్వం చెల్లించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను ఇప్పటికే విడుదల చేశాం.

మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తుతూ..:

"వైసీపీ ప్రభుత్వం రూ. 4064.59 కోట్లు బకాయిలు పెట్టి, ఇప్పుడు అసత్యాలు చెబుతోంది. బకాయిల వివరాలను సభ ముందు ఉంచేందుకు మేము సిద్ధం" అని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 12 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలను వీడారని, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు 70 వేలు పెరిగాయని వివరించారు.

"మేము గత పాలకుల్లా పరదాల చాటున తిరగడం లేదు.. ప్రజల్లో ఉంటున్నాం. చర్చకు భయపడే వైసీపీ సభ్యులు వాకౌట్ చేస్తున్నారు" అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.

చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, గత ప్రభుత్వ బకాయిలను కూడా తమ ప్రభుత్వమే తీరుస్తోందని మంత్రులు సభలో స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories