చంద్రబాబు బాటలో జగన్

చంద్రబాబు బాటలో జగన్
x
Highlights

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్వేతపత్రాలు ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేసేవి. శ్వేతపత్రాలను ప్రకటించేందుకు ప్రభుత్వాలు వెనుకాముందు...

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్వేతపత్రాలు ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేసేవి. శ్వేతపత్రాలను ప్రకటించేందుకు ప్రభుత్వాలు వెనుకాముందు అయ్యేవి. రాష్ట్ర విభజన తరువాత మాత్రం పరిస్థితి మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని గత ప్రభుత్వం పలు శ్వేత పత్రాలు ప్రకటించింది. ఇప్పడు సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. పరిస్థితి ఎందుకలా మారిపోయింది ? నిస్సంకోచంగా శ్వేతపత్రాలను ప్రకటించే ధైర్యం ప్రభుత్వాలకు ఎలా వచ్చింది ? పాలనలో పారదర్శకత పెరిగిందా ? ప్రభుత్వంపై ఒత్తిళ్ళు తగ్గించుకునే వ్యూహమా ? విపక్షాలను చిత్తు చేసే ఎత్తుగడనా? ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

రాష్ట్ర విభజన పూర్తి కాగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల బాట పట్టారు. 2014లో అధికారం చేపట్టగానే ఒక్కో రంగంపై ఒక్కో రోజు శ్వేతపత్రం ప్రకటించారు. ఇదీ రాష్ట్ర పరిస్థితి అంటూ ప్రజల మైండ్ ను ముందుగానే సెట్ చేసేశారు. తాజాగా సీఎం జగన్ కూడా అదే మార్గం ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రజల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపున మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రాలు ప్రకటించాలన్న నిర్ణయాన్ని హర్షించారు. అదే సమయంలో తమపై బురద చల్లితే సహించబోమని శ్వేత పత్రాలకు పోటీగా పత్రాలను ప్రకటిస్తామని కూడా అన్నారు. దీంతో ఏపీలో వైట్ పేపర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించారు. శ్వేతపత్రాలు ప్రకటించడం కొత్తేమీ కాదు. మాజీ సీఎం చంద్రబాబు కూడా శ్వేతపత్రాలను ప్రకటించారు. కాకపోతే ఆయన తన పాలన చివర్లో ఈ శ్వేతపత్రాలను వెలువరించారు. తద్వారా తనపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుదామనుకున్నారు. తాజా సీఎం జగన్ మాత్రం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే శ్వేత పత్రాలను ప్రకటించే ప్రక్రియకు నాంది పలికారు. తద్వారా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం ఏ విధంగా అందుకు కారణమైందో వివరించే వ్యూహం అమలు చేశారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి గత ప్రభుత్వం ఏ విధంగా కారణమైందో గణాంకాల ఆధారాలతో వివరించారు.

శ్వేత పత్రాలను ప్రకటించేందుకు ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగానే అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటేనే ఎంతో ఆసక్తి ఉంటుంది. అందులోనూ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సెషన్ అంటే మరింత ఆసక్తి నెలకొంటుంది. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయిన సందర్భంలో మరింతఆసక్తి నెలకొంటుంది. అధిక సంఖ్యాబలంతో అధికార పక్షం అల్ప సంఖ్యాబలంతో విపక్షం అసెంబ్లీలో తలపడనున్నాయి. రొటీన్ అంశాలకు తోడుగా తాజాగా వైట్ పేపర్లలోని అంశాలు రెండు పక్షాల మధ్య పోరును మరింత పెంచనున్నాయి. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని టీడీపీ ముందుగానే ప్రకటించినా మారిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అసెంబ్లీలో అధికార పక్షం వాదనను ప్రతిఘటించేందుకే విపక్షం ప్రయత్నించనుంది.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలోని వివరాలు ఊహించిన విధంగానే ఉన్నాయి. గణాంకాల వెల్లడికి తోడుగా వివిధ అంశాల్లో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలపై విమర్శలు కూడా అధికంగానే ఉన్నాయి. శ్వేతపత్రం గణాంకాలను బట్టి చూస్తే 2014-19 మధ్య ఏపీకి గడ్డు కాలం నడిచింది. జాతీయసగటుతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తక్కువగా నమోదైంది. 2014-15లో మైనస్ వృద్దిరేటు నమోదైంది. అప్పులు బాగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. గణాంకాలతో చేసే విశ్లేషణలు అన్ని సందర్భాలలోనూ నిజాలే కానవసరం లేదు. గణాంకాలను ఉపయోగించే వారిని బట్టి అవి ఇచ్చే అర్థాలు కూడా మారిపోతుంటాయి. రెండు వర్గాల వాదనలను విని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.

సుమారు వందేళ్ళ క్రితం 1922 జూన్ 3న మొట్టమొదటి వైట్ పేపర్ ను బ్రిటన్ లో చర్చిల్ ప్రభుత్వం ప్రకటించింది. పాలస్తీనా అంశంపై అది రూపుదిద్దుకుంది. అలాంటి శ్వేతపత్రం మన చట్టసభలకు కూడా కొత్తేమీ కాదు కొన్ని దశాబ్దాల నుంచి శ్వేతపత్రాలను ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో జగన్ ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రం మాత్రం సంచలనం కలిగించింది. రేపటి నాడు మరెన్నో వాదవివాదాలకు దారి తీయనుంది.

గత ప్రభుత్వహయాంలో ప్రారంభం నుంచే ప్రభుత్వం వద్ద నిధులు లేవు. దాంతో అప్పులు తేక తప్పలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్ ప్రకారం ఏపీ స్థూల ఉత్పత్తిలో 3శాతం మాత్రమే అప్పు చేయవచ్చు. కానీ 2015 నుంచి ప్రభుత్వం పరిధి దాటి మరీ అప్పు చేసింది. అప్పులు విపరీతంగా చేశారు గానీ దానివల్ల రాష్ట్రానికి చేసిందేమీ లేదని శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఎక్కడా పనికొచ్చే ఖర్చు చేసినట్టు లేదని విమర్శించారు. కేవలం కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేసేందుకే అనవసర ఖర్చులు చేశారని విమర్శించారు. రాజధాని తాత్కాలిక భవనాలు, రహదారుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తాత్కాలిక భవనాల కోసం అనవసర ఖర్చు చేశారని విమర్శించారు. దాదాపు 32కోట్ల రూపాయలతో అమరావతిలో కి.మీ మేర రోడ్లు వేస్తున్నారని అప్పు చేసి అలాంటి రోడ్లు వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నప్పుడు చేయాల్సిన పనులను రెవెన్యూ లోటులో ఉన్నప్పుడు అప్పులు చేసి మరీ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఫలితంగా రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ బిల్లులు చెల్లించలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి 3 . 62లక్షల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు పెట్టి వెళ్లిపోయిందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని చాలా నష్టపరిచారని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన శ్వేతపత్రంలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ దానిపై తెలుగుదేశం నుంచి తీవ్ర స్పందన వచ్చే అవకాశం ఉంది. వివిధ గణాంకాలపై, అంశాలపై అసెంబ్లీలో అది తన వాదన వినిపించేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో అసెంబ్లీ సమావేశాలు మరింత వాడిగా, వేడిగా జరుగనున్నాయి.

వైట్ పేపర్...బ్లూ పేపర్...గ్రీన్ పేపర్....ఎల్లో పేపర్.....ఇవన్నీ పేపర్ల రంగులు కాదు. విధానాలకు, అధ్యయన ఫలితాలకు సంబంధించిన అంశాలను వెల్లడించేందుకు పెట్టుకున్న పేర్లు. ఏపీలో ఇప్పుడు వైట్ పేపర్ హాట్ న్యూస్ గా మారింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన కొత్తలో కూడా వైట్ పేపర్ హాట్ న్యూస్ గానే ఉండింది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది. అప్పట్లో ఖజానా ఏవిధంగా ఖాళీగా ఉందో ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ ను ఒక మార్గం ఎంచుకున్నారు. ఇప్పుడు నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖజానాను ఏవిధంగా ఖాళీ చేసిందో వివరించేందుకు వైఎస్ జగన్ వైట్ పేపర్ ను ఒక అస్త్రంగా మార్చుకున్నారు. వైట్ పేపర్లను ప్రకటించడంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఒక అర్థవంతమైన చర్చ జరిగేందుకు మార్గం ఏర్పడింది. తన వద్ద ఉన్న గణాంకాలతో అధికార పక్షం వైట్ పేపర్ ప్రకటించడం తమ వద్ద ఉన్న ఆధారాలతో విపక్షం ఆ వైట్ పేపర్ లో తప్పుడు వెతకడం ఆనవాయితీ. మరో విధంగా చెప్పాలంటే పారదర్శక పాలనకు కూడా ఈ వైట్ పేపర్లు తోడ్పడుతాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు మరింత చక్కటి అవకాశం కలుగుతుంది. వైట్ పేపర్లను ప్రకటించడం ఒక సంప్రదాయంగా స్థిరపడితే ప్రజాస్వామిక పాలన మెరుగుకు అంతకు మించిన సాధనం మరొకటి ఉండదు. కాకపోతే ఈ వైట్ పేపర్ ను ప్రకటించడంలోనూ ఎన్నో రకాల గమ్మత్తులు ఉంటాయి. గిమ్మిక్కులూ ఉంటాయి. అవి లేకుండా వైట్ పేపర్ వెలువడితే మాత్రం అసలైన వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. అలాంటి వైట్ పేపర్స్ ప్రకటించడం, రాగద్వేషాలకు అతీతంగా వాటిని విశ్లేషించుకోవడం ఒక సంప్రదాయంగా స్థిరపడాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories