ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ

ఈ నెల 27న ఏపీ కేబినెట్ భేటీ
x
Highlights

ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. ఈ నెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. ఈ నెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై చర్చించనుండటంతో కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.

ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో సంక్షేమ పథకాలపై సమీక్షించనుంది మంత్రివర్గం. డిసెంబర్ 25న నిర్వహించే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త పథకాలు, భూముల కేటాయింపులపై ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది. ఈ నెల 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల అజెండాపైనా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‌.

రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుండటంతో జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలుతీరును పర్యవేక్షించేందుకు ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న రచ్చబండపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పథకాల డెలివరీ వ్యవస్థల్లో లోటుపాట్లను సరిచేసి ఫీడ్‌బ్యాక్‌ సేకరించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.

వీటితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిధులను రాబట్టుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు-గోరకల్లు ప్రాజెక్ట్ వంటి అంశాలన్నీ మంత్రివర్గం ముందుకు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలో కాక రేపుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదంటూ సీఎస్‌ నీలం సాహ్ని ఎస్‌ఈసీకి స్పష్టం చేశారు. ఈ అంశం మరోసారి కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దం అవుతూ స్థానిక ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేయటం ద్వారా ఎదురయ్యే విమర్శలకు ఏ రకంగా సమాధానం చెప్పాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ భేటీ ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories