
AP Budget 2025: ఏపీ బడ్జెట్ ఎలా ఉంది? ఏయే రంగాలకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు?
AP Budget 2025 Highlighs: చంద్రబాబు ప్రభుత్వం 3,22,359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల...
AP Budget 2025 Highlighs: చంద్రబాబు ప్రభుత్వం 3,22,359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 28న బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి ఏ మేరకు నిధులు కేటాయించారు? పోలవరం, అమరావతిపై బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయి? బడ్జెట్ పై వైఎస్ఆర్‌సీపీ ఎందుకు పెదవి విరుస్తోంది? ఓవరాల్‌గా ఏపీ బడ్జెట్ ఎలా ఉందో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
ఏపీ రెవిన్యూ లోటు రూ.33,185 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రెవిన్యూ అంచనా వ్యయం 2,51, 162 కోట్లుందని తెలిపింది. మూలధన వ్యయం 40వేల 635 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇక రెవిన్యూ లోటు 33, 185 కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు 79 వేల 926 కోట్లుగా ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్‌డీపీలో రెవిన్యూ లోటు 1.82 శాతంగా, ద్రవ్యలోటు 4.38 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
సూపర్ సిక్స్ పథకాలపై బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నాయి?
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలు అమలు చేయాలంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సూపర్ సిక్స్ లో ప్రధానంగా తల్లికి వందనం పథకంపై బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చెబుతోందనే ప్రజలు ఆశగా ఉన్నారు.
ఈ పథకానికి 9,407 కోట్లు కేటాయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్ధులకు ఈ పథకం వర్తిస్తోంది. ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి తల్లి పేరున 15 వేల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రైతుకు 20 వేల ఆర్ధిక సహాయం చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్లు కేటాయించారు. దీపం పథకం కింద మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని మేనిఫెస్టోలో హమీ ఇచ్చారు. గత దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకు గాను 2,601 కోట్లు కేటాయించారు. నిరుద్యోగులకు ప్రతి నెల 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హమీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన లేదు.
18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయాల ఆర్ధిక సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ, దీనికి సంబంధించి బడ్జెట్ లో ప్రస్తావించలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఒకేసారి సాధ్యమా అంటే సాధ్యం కాదు. అయితే దశలవారీగా హామీల అమలు చేయాల్సి ఉంటుంది. అభివృద్ది, సంక్షేమం సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అధిక ప్రాధాన్యత కలిగిన వాటికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు సర్కార్ అంచనాలను చేరుకోలేకపోయిందని సీనియర్ జర్నలిస్ట్ సి.కృష్ణాంజనేయులు చెప్పారు. అయితే అలా అని ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదని ఆయన అన్నారు.
అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రం ఏపీ
ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకునే సామర్ధ్యం పడిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి ఏపీకి వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దేశంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందని మంత్రి ప్రస్తావించారు. 2024 జూన్ 12 నాటికి 23, 556 కోట్ల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బును ఇవ్వాలి. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వని కారణంగా 93 పథకాలు నిలిచిపోయాయి. 9,371కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీంతో 74 కేంద్ర ప్రభుత్వ పథకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇది ఒక రకంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించింది. రోడ్లు, భవనాలు, ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది.
అప్పులకు రూ. 58 వేల కోట్లు
ఎన్నికల్లో గెలుపు కోసం ఎడాపెడా చేసిన వాగ్ధానాలు రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపుతున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్ లో 18 శాతం నిధులను అప్పులు, వడ్డీలకే చెల్లించాల్సి వస్తోంది. ప్రతిపాదిత 3.22 లక్షల కోట్ల బడ్జెట్ లో సుమారు 58 వేల కోట్లు అప్పులు, వడ్డీల కింద చెల్లించాల్సి వస్తోంది. కేంద్రంతో చంద్రబాబుకు మంచి సంబంధాలున్నాయి. ఇది ఒక రకంగా రాఫ్ట్రానికి ప్రయోజనమే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు ఇతర అంశాల విషయంలో కేంద్రం రాష్ట్ర వినతులపై సానుకూలంగా స్పందిస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6,705 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 5,936 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు ప్రకటించింది.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.6,705 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సర్టిఫికెట్లు చూపితే కేంద్రం ఆ నిధులను మంజూరు చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రధాన డ్యాం పనుల్లో మిగిలిన వాటిని పూర్తి చేస్తారు. ఈ పనులకు ముందే అంటే 2026 అక్టోబర్ నుంచి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తారు.
అమరావతికి రూ. 6 వేల కోట్లు
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై కేంద్రీకరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పక్కన పెట్టింది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అప్పట్లో అమరావతి రాజధాని రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి.
2024 కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధులను ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర సంస్థల నుంచి రుణంగా ఇప్పించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వనుంది. వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్ మెంట్ బ్యాంక్ రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరుకు ముందుకు వచ్చాయని ఏపీ సర్కార్ 2024 నవంబర్ లో ప్రకటించింది.
సూపర్ సిక్స్ హామీలకు అరకొర నిధులు: బొత్స
చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ పై విపక్షం అసంతృప్తిని వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని శాసనమండలిలో విపక్ష నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు సరిపోవని ఆయన అన్నారు.
అప్పులు తీర్చేందుకు అప్పులు తేవాల్సిన పరిస్థితులు నెలకొంది. తెచ్చిన అప్పుల్లో మెజారిటీ వాటా అప్పులు, వడ్డీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్ధిక పరిస్థితులను చక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం ఆర్ధికంగా గాడినపడుతోందా లేదా అనేది వెయిట్ అండ్ సీ....

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




