logo
ఆంధ్రప్రదేశ్

YSR Bheema Scheme: పేదల కోసం ఏపీ సర్కార్ మరో కొత్త పథకం!

YSR Bheema Scheme: పేదల కోసం ఏపీ సర్కార్ మరో కొత్త పథకం!
X
YSR Bheema Scheme
Highlights

YSR Bheema Scheme: ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పొదిలో మరో పథకం వచ్చి చేరింది. దీనివల్ల సహజ మరణం సంభవించినా ఆదుకునేలా పథకాన్ని రూపుదిద్దారు.

YSR Bheema Scheme: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పొదిలో మరో పథకం వచ్చి చేరింది. దీనివల్ల సహజ మరణం సంభవించినా ఆదుకునేలా పథకాన్ని రూపుదిద్దారు. ఈ పథకం పేద కుటుంబాలకు పూర్తిస్థాయిలో ఆసరా చూపించనుంది. ఏపీ ప్రభుత్వం రూపొందించిన వైఎస్సార్ భీమాతో రాష్ట్రంలో 1.50 కోట్ల మందికి లబ్ది చేకూరే విధంగా ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదించింది.

బియ్యం కార్డు ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన 'వైఎస్సార్‌ బీమా' పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. అయితే దీనిని కొంత కాలం క్రితం ఉపసంహరించుకుంది. దీంతో పేదలకు ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యంకార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

'తూర్పు'లో 2 వేల ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

– తూర్పు గోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లలో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. అందుకోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదించారు.

– 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచాన వేస్తోంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

– వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ క్లస్టర్‌ ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈక్టస్టర్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.730 కోట్లు ఖర్చు చేస్తుంది.

– శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు రూ.3,669.95 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ దశలో భాగంగా 2024–25నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హ్యాండ్లింగ్, 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హ్యాండ్లింగ్‌ చేయాలన్నది లక్ష్యం.

ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌

– ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం–2006 సరవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా సీడ్‌ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందుతుంది.

– పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం–2020కి ఆమోదం.

– చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 26 టీచింగ్, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టులు, వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు.

– విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు.

– వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం. పులివెందుల పోలీస్‌ సబ్‌డివిజన్‌ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కి.మీ. దూరంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయచోటిలో కొత్తగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్‌ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరు.

– పంచాయతీరాజ్‌ శాఖలో తొలిసారిగా 51 డివిజనల్‌ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

Web TitleAndhra Pradesh Government to Launch YSR Bheema Scheme and cabinet Approves here are the details
Next Story