Amaravathi: స్టాంప్‌ పేపర్‌పై ఇళ్ల పట్టా... ఉగాదికి ప్రభుత్వ కానుక

Amaravathi: స్టాంప్‌ పేపర్‌పై ఇళ్ల పట్టా... ఉగాదికి ప్రభుత్వ కానుక
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్‌ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.పది స్టాంప్‌ పేపర్‌పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది.

రిజిస్ట్రార్‌ కార్యాలయానికి డాక్యుమెంట్‌ రూ.పది స్టాంపు పేపర్‌ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దారు సంతకం ఉంటుంది. రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుం ది. మూడో పేజీ (ఫారం 32-ఏ)లో తొలుత తహసీల్దారు / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్‌పోర్టు ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు/ ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్‌ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. స్టాంప్‌ పేపర్‌పై సాక్షి, తహసీల్దారు సంతకాలు చేస్తారు.

డాక్యుమెంట్‌ మూడు పేజీలను స్కానింగ్‌ చేసి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపిస్తారు. లబ్ధిదారుల పేరిట తహసీల్దారులే రిజిస్ట్రేషన్‌ చేయిస్తారు. రూ.పది స్టాంపు పేపర్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది. లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపర్యంగా అనుభవించ వచ్చు. అవసరాల నిమిత్తం ఇంటి స్థలాన్ని బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని పట్టాలో పేర్కొన్నారు. అవసరమైతే ఐదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలు చేపట్టవచ్చు. నవరత్నాల పథకాల వివరాలతోపాటు వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories