logo
ఆంధ్రప్రదేశ్

కర్నుల్ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి

Andhra Pradesh Chief Minister Jagan Reacted On Kurnool accident
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు...

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్నలారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్‌, ఆస్మా, కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున 4.30గంటలకు ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి....

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌, ఎస్పీ ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తామని, క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

Web TitleAndhra Pradesh Chief Minister Jagan Reacted On Kurnool accident
Next Story