logo
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోడీకి లేఖ

Andhra Pradesh Chief minister Jagan Letter To PM Modi
X

ఫైల్ ఇమేజ్ 

Highlights

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా వ్యతిరేక జ్వాలలు వెల్లువెత్తాయి. కేంద్రం తమ నిర్ణయాన్ని ఉప...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా వ్యతిరేక జ్వాలలు వెల్లువెత్తాయి. కేంద్రం తమ నిర్ణయాన్ని ఉప సంహరించుకోకపోతే ఉద్యమాలు చేస్తామంటూ కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు హెచ్చరికలు పంపుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం జగన్.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్‌ ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందని వివరించారు సీఎం జగన్. దశాబ్ద కాలంపాటు ప్రజలు పోరాటం చేయగా.. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇక విశాఖ ఉక్కు ప్లాంటు ద్వారా దాదాపు 20వేల మంది ప్రత్యక్షంగా వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు సీఎం జగన్. 2002-15 మధ్య వైజాగ్‌ స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందన్నారు. ఈ ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల భూములు ఉన్నాయని వాటి విలువే దాదాపు లక్ష కోట్లు ఉంటుందని వివరించారు.

ఇక కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడితే మళ్లీ ప్లాంటును ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చన్నారు సీఎం జగన్ 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో 200 కోట్ల లాభం వచ్చిందని వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.

ఉత్పత్తి ఖర్చు పెరగడంతో కష్టాలు వచ్చాయని... ప్లాంటుకు సొంతంగా గనుల్లేవనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. బైలదిల్లా గనుల నుంచి టన్ను ముడి ఖనిజాన్ని 5 వేల 260 రూపాయల చొప్పున ప్లాంటు కొనుగోలు చేస్తోందని.. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా 3వేల 472 రూపాయల చొప్పున భారం పడుతోందని వివరించారు. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయని వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడంద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకెళ్లొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇక బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందన్నారు సీఎం జగన్. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుందని తెలిపారు. స్టాక్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని తద్వారా ఆర్థిక పునర్‌నిర్మాణం జరుగుతుందన్నారు.


Web TitleAndhra Pradesh Chief minister Jagan Letter To PM Modi
Next Story