అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రధాన ఎజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రధాన ఎజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు
x
Highlights

ఏపీ మంత్రివర్గ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని.. సభలో ఏం చర్చించాలన్న దానిపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం, హైకోర్టులో కేసు విచారణపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు. నివర్‌ తుఫాను, వరద నష్టంపైనా కేబినెట్‌ చర్చించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నివార్‌ తుపాను కారణంగా జరిగిన నష్టం, వరదలు, తక్షణం అందించే సాయంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏపీలో కరోనా కేసుల నమోదు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. శీతాకాలంలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం దృష్టి సారిస్తుంది. సెకండ్‌వేవ్‌ కూడా వచ్చే ప్రమాదముండడంతో…. వైరస్‌ కట్టడి చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పాఠశాలల్లో వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు దగ్గర వైఎస్‌ఆర్‌ వంద అడుగుల విగ్రహ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశముంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అంశం సైతం కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలుపైనా మంత్రిమండలిలో చర్చ జరుగనుంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం విజయవతంపై కేబినెట్‌ చర్చించనున్నారు. కోర్టు కేసులులేని అన్ని చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ క్రిస్మస్‌ రోజున ప్రభుత్వం చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా చర్చ జరుగనుంది. ఈ అంశాలపై సీఎం జగన్ మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories