ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..ప్రధానంగా చర్చకు రానున్న..

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..ప్రధానంగా చర్చకు రానున్న..
x
Highlights

ఏపీ మంత్రివర్గ సమావేశానికి సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు, రాష్ట్రంలో వ‌ర‌దల వ‌ల్ల క‌లిగిన న‌ష్టంతో పాటు ఈ నెల‌లో ప్రారంభించే సంక్షేమ...

ఏపీ మంత్రివర్గ సమావేశానికి సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు, రాష్ట్రంలో వ‌ర‌దల వ‌ల్ల క‌లిగిన న‌ష్టంతో పాటు ఈ నెల‌లో ప్రారంభించే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చించేందుకు క్యాబినెట్ స‌మావేశం జరుగనుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వివాదం, పోల‌వరంపై సందిగ్థం, దిశ చ‌ట్టంలో ప‌లు స‌వ‌ర‌ణ‌ల‌కు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. మొత్తం 15 అంశాలతో మంత్రివర్గ సమావేశం జరగనుంది.

రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో జ‌ర‌గ‌నుంది. ప్ర‌ధానంగా ఈ నెల‌లో ప్రారంభించే సంక్షేమ ప‌థ‌కాలపై క్యాబినెట్‎లో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. సంక్షేమ క్యాలెండర్ లో భాగంగా త్వ‌ర‌లో జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు. చిరు వ్యాపారులు, వీధుల్లో వస్తువులు, కూరగాయాలు, పండ్లు అమ్ముకుని జీవనం సాగించేవారికి ఈ పథకం ద్వారా 10 వేల రుణాన్ని అందించనున్నారు. 9.08 లక్షల మందికి 474 కోట్ల రూపాయల నిధులను వెచ్చించనున్నారు.

మరోవైపు ఇటీవల కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు, వర్షాలతో పంట నష్టం విషయంలో కేంద్రం సాయంపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ నెల 9వ తేదీన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుండటంతో ఎక్కడికక్కడ ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వరద తీవ్రతను వారికి వివరించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ లో సీఎం జగన్ సూచించ‌నున్నారు. అటు వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల సంరక్షణ కోసం తక్షణం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు కొత్త టూరిజం పాలసీకి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసే అవ‌కాశం ఉంది.

అటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌పైనా మంత్రిమండ‌లి చ‌ర్చించ‌నుంది. పోలవరం ప్రాజెక్ట్ కు ముందుగా ఆమోదించిన నిధులను మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ, సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం వీటిని ఆమోదించకపోతే ఏం చేయాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈనెల చివ‌రి వారంలో నిర్వ‌హించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీంతో ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల తేదీల నిర్వహణపై స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండా తిరిగి పంపడంతో చట్టాన్ని పార్లమెంట్‎లో ఆమోదింపచేసుకోవటానికి ఏం చేయాలనే అంశంపైనా కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు రానుంది. దీంతో వివిధ కారణాలతో నాలుగుసార్లు వాయిదా పడ్డ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories