ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
x
Highlights

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో...

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే, జగన్ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు ఎస్ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నవంబర్‌లో ప్రొసీడింగ్స్ జారీ చేసింది. అయితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు జరపలేమంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్వర్వులను నిలిపివేయాలంటూ ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెకండ్ వేవ్ కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలపై పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎస్‌ఈసీ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయించిందని జగన్ సర్కారు హైకోర్టుకు నివేదించింది. కరోనా కారణంతోనే ఇంతకుముందు స్థానిక ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేసిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. నవంబర్ చివరి నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్స్ సంఖ్య 8లక్షల 67వేలు దాటాయని, రోజుకు సగటున వెయ్యి కేసులు వస్తున్నాయని వేలాది మంది పోలీసులు, ఉద్యోగులు కరోనా బారినపడ్డారని నివేదించింది. కరోనా తీవ్రత దృష్ట్యా సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్దామని ఎస్‌ఈసీకి తెలియజేశామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ, ఎస్‌ఈసీ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చినందున ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories