Ambati Rambabu: కోర్టు ప్రాంగణంలో అంబటి రాంబాబు హల్‌చల్.. పోలీసు వ్యాన్‌లోనే 'తగ్గేదేలే'!

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు.

Arun Chilukuri
Updated on: 12 Feb 2026 2:44 PM IST
Ambati Rambabu: కోర్టు ప్రాంగణంలో అంబటి రాంబాబు హల్‌చల్.. పోలీసు వ్యాన్‌లోనే తగ్గేదేలే!
X

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. సత్తెనపల్లిలో గతంలో జరిగిన సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు తరలించారు.

పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ తరహాలో స్పందించారు. వ్యాన్ సీటుపై కూర్చుని, గెడ్డం కింద చేయి పెట్టి ‘తగ్గేదేలే’ అనే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లాటరీలో భారీ అవినీతి జరిగిందని జనసేన నాయకులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.

గత నెల 31 నుండి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబుకు ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ మంజూరైంది. అయితే, తాజా పీటీ వారెంట్ నేపథ్యంలో ఆయనను కోర్టుకు తీసుకువస్తుండటంతో గుంటూరు కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు రాకతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story