అమరావతి ఆందోళనలకు ఏడాది.. మూడు రాజధానులపై ఆగని మంటలు..

అమరావతి ఆందోళనలకు ఏడాది.. మూడు రాజధానులపై ఆగని మంటలు..
x
Highlights

ఏపీ రాజధాని ఉద్యమం ఉప్పెనల్లే ఏడాదిగా ఎగిసి పడుతోంది. పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు. కేసులు పెట్టి.., జైళ్లలో ఉంచినా బాధితులు కుంగిపోలేదు. చివరకు...

ఏపీ రాజధాని ఉద్యమం ఉప్పెనల్లే ఏడాదిగా ఎగిసి పడుతోంది. పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు. కేసులు పెట్టి.., జైళ్లలో ఉంచినా బాధితులు కుంగిపోలేదు. చివరకు కరోనా కాలంలోనూ కాళ్లు ఇంట్లో పెట్టుకోలేదు. పోటీ ఉద్యమాల కవ్వింపులపై రెచ్చిపోలేదు. 'అమరావతి ఏకైక రాజధాని' అనే ఏకైక నినాదమే శాంతియుత మంత్రంగా సంవత్సరమంతా పఠిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీలో సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆరోజు ఆయన చేసిన ప్రకటన ఊరు, వాడను ఉద్యమవేదికపై ఏకంచేసింది.

రాజధానిలోని 29 గ్రామాలు ఉద్యమ బాటపట్టి కదం తొక్కుతున్నాయి. పోలీసులు తలుపు తట్టి ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఏ ఒక్క రోజూ విశ్రమించలేదు. మొదట మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్ది రోజుల్లోనే గుంటూరు, కృష్ణా జిల్లాలను కదిలించింది. ఆతర్వాత రాజధానిలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది.

మూడు రాజధానుల ప్రకటన నాటికి రాజధానిలో ఇంచుమించుగా 20వేల కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ప్రారంభమై తుది దశకు చేరుకొన్నాయి. అంతేకాదు ఎంతోమందికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. రాజధాని ఏర్పాటులో రైతులదే కీలక పాత్ర. రాజధాని కోసం తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు వారు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలతో పాటు రాష్ట్రంలో అందరి పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని మనస్సుకు తమకు తాము సర్దిజెప్పుకొన్నారు.

ఇంతలో 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మూడు రాజధానుల ఏర్పాటును లిఖించింది. తొలుత రాజధానిలో పనులు నిలిపేసింది. దీనిపై ఉద్యమం రాజుకొంది. ఉద్యమం తొలి రోజుల్లో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొన్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు అంగీకరించకపోవడంతో, రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.

అమరావతి నాన్‌ పొలిటికల్‌ జేఏసీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలో రైతులు భాగస్వామ్యం అయ్యారు. 15 కిలోమీటర్లకు పైగా దూరానికి మూడుసార్లు పాదయాత్ర చేసి ఐక్యతని చాటి చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చినుంచి భౌతిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories