పీసీసీ రేసులో రేవంత్‌కు స్పీడ్‌ బ్రేకర్ల పరేషానా?

పీసీసీ రేసులో రేవంత్‌కు స్పీడ్‌ బ్రేకర్ల పరేషానా?
x
Highlights

పీసీసీ రేసులో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న రేవంత్‌ రెడ్డికి, భూకబ్జా ఆరోపణలు బ్రేకులేస్తున్నాయా? భూదందా ఆరోపణలు, ప్రత్యర్థి పార్టీ నేతల కంటే, సొంత...

పీసీసీ రేసులో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న రేవంత్‌ రెడ్డికి, భూకబ్జా ఆరోపణలు బ్రేకులేస్తున్నాయా? భూదందా ఆరోపణలు, ప్రత్యర్థి పార్టీ నేతల కంటే, సొంత పార్టీలోని నేతలకే ఆయుధంగా మారాయా? రేవంత్‌పై తాజా ఆరోపణలను అస్త్రంగా మలచుకుని, పీసీసీ పీఠం దక్కకుండా కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు పావులు కదుపుతున్నారా? రేవంత్‌ రెడ్డి అనుచరులకు కలుగుతున్న ఈ అనుమానాల్లో నిజముందా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రోజురోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు పీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటాపోటీ వున్న నేపథ్యంలో, రేవంత్‌ రెడ్డి భూముల వివాదంలో ఇరుక్కోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని ఎన్నడో ప్రకటించారు. కానీ ఎవరిని ఎంపిక చెయ్యాలన్నదానిపై సోనియాగాంధీ తర్జనపడుతున్నారు. అయితే, దూకుడు మీద వుండే రేవంత్ రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపుతోందన్న చర్చ జరిగింది. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి, ఆమెతో ఫోటో కూడా తీయించుకున్న రేవంత్ ఫ్యామిలీ, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో రేవంత్‌కు పీసీసీ ఖాయమైందన్న చర్చ, ఆ ఫోటో నుంచే ప్రారంభమైంది. కానీ రేవంత్‌ పీసీసీ చీఫ్‌ కావడం, పార్టీలో సీనియర్‌లకు ఏమాత్రం ఇష్టంలేదన్నది బహరంగ రహస్యం. ఎలాగైనా, రేవంత్‌కు పీసీసీ పగ్గాలు రాకూడదని, వ్యతిరేకవర్గం ఢిల్లీలో చక్రంతిప్పుతోందట. ఇలా సొంత పార్టీలోనే వైరి వర్గం అడ్డుపుల్లలు వేస్తోన్న టైంలో, రేవంత్‌పై భూముల ఆరోపణలు, అదే వర్గానికి ఆయుధంగా మారాయన్న చర్చ జరుగుతోంది.

గోపన్‌పల్లిలో రేవంత్‌ రెడ్డి సోదరులు, భూకబ్జాకు పాల్పడ్డారని, కొందరు బాధితులు కంప్లైయింట్ ఇచ్చారు. రేవంత్‌పై ఈ భూదందా ఆరోపణలు దుమారం రేపాయి. టీఆర్ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అటు రేవంత్‌కు అండగా నిలవాల్సిన పార్టీ నేతలు మాత్రం రెండుగా చీలిపోయారు. కొందరు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌తో పాటు టీవీల్లో మొక్కుబడిగా, ఖండించారు. కానీ పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న కొందరు నేతలు మాత్రం, అసలు నోరుమెదపలేదు. తాజాగా రేవంత్‌ను అరెస్టు చేయడాన్ని కూడా కొందరు కాంగ్రెస్‌ నేతలు ఖండించలేదు. నిరసన వ్యక్తం చేయలేదు. దీంతో రేవంత్‌పై భూముల కబ్జా ఆరోపణలను ఆయుధంగా మలచుకుని, ఆయనకు పీసీసీ దక్కకుండా చేయడానికి ఈ సందర్భాన్ని బాగా వినియోగించుకోవాలని సదరు నేతలు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఢిల్లీలో అధిష్టాన పెద్దల చెవిలో వేశారట. ఓటుకు నోటు కేసుతో పాటు భూకబ్జా ఆరోపణలు రేవంత్‌పై వున్నాయని, కొడంగల్‌లో ఓడిపోయారని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, మరింత చేటు తప్పదని, ఢిల్లీ పెద్దలకు నివేదికలు పంపించారట.

భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు పెద్దగా స్పందించకపోవడాన్ని బట్టి చూస్తుంటే, కొందరు పెద్దలతో కలిసి, కాంగ్రెస్‌ నేతలు పథకం ప్రకారం, రేవంత్‌ను ఇరికిస్తున్నారని, ఆయన అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. లేకపోతే సరిగ్గా పీసీసీ రేసు రసవత్తరంగా సాగుతున్న టైంలోనే భూకబ్జా ఆరోపణలు తెరపైకి రావడమేంటని ప్రశ్నిస్తున్నారట రేవంత్ అనుచరులు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత గాంధీభవన్‌ సింహాసనంపై కూర్చుంటారని ఊహాగానాలు వినిపిస్తున్న టైంలో, జరుగుతున్న పరిణామాలు రేవంత్‌కు ప్రతిబంధకంగా మారాయని, ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. చూడాలి, మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories