రాజకీయ రంగు పులుముకున్న సలాం ఫ్యామిలీ సూసైడ్ ఘటన

రాజకీయ రంగు పులుముకున్న సలాం ఫ్యామిలీ సూసైడ్ ఘటన
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. వేధింపులకు గురిచేసి నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని...

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. వేధింపులకు గురిచేసి నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని టీడీపీ నేత లోకేశ్ మండిపడితే.. ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ ఫైరయ్యారు. అటు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ నంద్యాల కోర్టులో విచారణ జరగనుంది.

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల ర్యాలీలు తీశారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వంపై కొందరు బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

నంద్యాల ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ, కానిస్టేబుల్ బెయిల్‌పై విడుదలవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం చెలరేగింది. వేధింపులకు గురిచేసి నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యుల ఇంటికి పోలీసులను పంపి భయపెడుతున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించిన లోకేష్ కేసును సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నంద్యాల ఘటనపై సీఎం జగన్ స్పందించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ఒక లాయర్ బెయిల్ పిటిషన్ వేశారని బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. ప్రభుత్వంపై కొందరు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమను చూపిస్తున్నారని ముస్లింలను అభిమానించే పార్టీ కేవలం వైసీపీ మాత్రమేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ముస్లింలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ ఆత్మహత్య ఘటనపై నేడు నంద్యాల కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కీలక విచారణ జరుగనుంది. దీంతో టీడీపీ, వైసీపీల మధ్య మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories