జనసైనికులు, సోషల్ మీడియా చొరవతో ఒక్కటైన కుటుంబసభ్యులు

జనసైనికులు, సోషల్ మీడియా చొరవతో ఒక్కటైన కుటుంబసభ్యులు
x
Highlights

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్ధాలు. ఇంటినుంచి తప్పిపోయిన ఓ వ్యక్తి 30 ఏళ్ళ తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని ఇంటికి చేరాడు....

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్ధాలు. ఇంటినుంచి తప్పిపోయిన ఓ వ్యక్తి 30 ఏళ్ళ తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని ఇంటికి చేరాడు. తమ్ముడ్ని చూసి చలించిపోయిన అక్క అతనికి అక్కున చేర్చుకుంది. శ్రీహరిరావు అనే అతన్ని మూడు దశాబ్ధాల తర్వాత ఇంటికి చేర్చడంలో కీలకపాత్ర వహించారు జనసైనికులు. ఆ అదృశ్య కథ ఏమిటో మీరే చూడండి.

ఇక మూడు దశాబ్ధాల అదృశ్య ఘటన వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన కాళిశెట్టి శ్రీహరిరావు 30 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియక కుటుంబ సభ్యులు వెతికి వెతికి అలసిపోయారు. బెంగతో కుమిలిపోయారు. ఎన్నాళ్ళైనా తిరిగి రాకపోవడంతో ఇక వదిలేశారు. ఏదో రోజున తిరిగి వస్తాడని గంపెడాశతో నిరీక్షించారు. నిజంగా శ్రీహరిరావు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్ళ పర్యంతమయ్యారు. అయితే శ్రీహరిరావు మానసిక స్థితి కుదుట పడాల్సివుంది.

ఇంతకీ తప్పిపోయిన వ్యక్తి 30 ఏళ్ళ తర్వాత ఎలా వచ్చాడనే ఆసక్తి కలగవచ్చు. ఇందుకు జనసైనికులు, సోషల్ మీడియా కారణం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం రణస్థలం గ్రామంలో శ్రీహరిరావుకు రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాలతో వున్న శ్రీహరిరావుకు అక్కడే ఉన్నా ఎచ్చెర్లకి చెందిన జనసైనికులు కాపాడి హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయించారు. అతని వివరాలు ఆరా తీశారు. తనది తాటిపాక, కోనసీమ అని, తన పేరు శ్రీహరిరావు అని వివరాలు చెప్పడంతో జనసైనికులు సువ్వాడ రామారావు, ఉద్వల అంజిబాబు, దన్నాన చిరంజీవిలు సోషల్ మీడియాలో ఆ వివరాలను ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. ఆ ప్రచారంలో రాజోలు చిరుపవన్ సేవాసమితి అధ్యక్షుడు గుండాబత్తుల తాతాజీ, కోళ్ళబాబి, సూదా మోహన్ రంగా, తాటిపాకలో శ్రీహరిరావు ఇంటిని గుర్తించారు. ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరిగి ఆ సమాచారాన్ని వెంటనే ఎచ్చెర్ల జనసైనికులను సంప్రదించి చెప్పారు. వెంటనే కారులో శ్రీహరిరావును తీసుకువచ్చి సోమవారం రాజోలు జనసైనికుల సహకారంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా శ్రీహరిరావు సోదరి కాళిశెట్టి అనంతలక్ష్మి మాట్లాడుతూ తన అన్న ముఫై ఏళ్ళ క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడని ఇంతకాలానికి ఈరోజు తనని చూడటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, జనసైనికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. మూడు దశబ్ధాల తరువాత ఒక్కటైన కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. శ్రీహరిరావు మానసిక పరిస్థితి కూడా చక్కబడి కుటుంబసభ్యులంతా హ్యాపీగా ఉండాలని హెచ్ఎమ్టీవీ కోరుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories