హిందూపురం వైసీపీ కోల్డ్‌వార్‌ కథలో మలుపేంటి?

హిందూపురం వైసీపీ కోల్డ్‌వార్‌ కథలో మలుపేంటి?
x
Highlights

హిందూపురంలో తొడకొడితే బాలయ్యే కొట్టాలి మరొకరి కొడితే, ఆయనకు మండిపోతుంది కానీ బాలయ్య అంటే భయంలేదో, అసలు లెక్కేలేదో కానీ, ఇద్దరు నాయకులు సినిమా రేంజ్‌లో...

హిందూపురంలో తొడకొడితే బాలయ్యే కొట్టాలి మరొకరి కొడితే, ఆయనకు మండిపోతుంది కానీ బాలయ్య అంటే భయంలేదో, అసలు లెక్కేలేదో కానీ, ఇద్దరు నాయకులు సినిమా రేంజ్‌లో కొట్టుకుంటున్నారు. నువ్వానేనా అంటూ రెచ్చిపోతున్నారు. అదేదో రెండు పార్టీల ప్రత్యర్థులు కాదు ఒకే పార్టీ నాయకులే. సీమ సందుల్లో, సీమ టపాకాయాల్లా పేలిపోతున్నారు. స్క్రీన్‌ మీద బాలయ్య రెచ్చిపోతే, రియల్‌గానే కత్తులు నూరుతూ, కయ్యమాడుతున్నారు లీడర్లు. ఒక నాయకుడు ఏకంగా కరోనాను తరిమికొట్టినట్టు, ఆ‍ నేతనూ తరిమికొట్టాలంటూ, జబర్దస్త్ డైలాగులు విసురుతున్నారు. ఇంతకీ ఎవరు వారు?

టీడీపీ కంచుకోట హిందూపురంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ అహ్మద్ ఇక్బాల్, నవీన్ నిశ్ఛల్ వర్గాలుగా పార్టీ క్యాడర్ చీలిపోయి పోటాపోటీగా ఆందోళనలకు దిగుతున్నాయి. స్థానిక నేతలు అసలైన నేతలు తామే అంటూ బ్యానర్లు కట్టి సమావేశం ఏర్పాటు చేసింది. పోటీగా ఎమ్మెల్సీ వర్గం ప్రదర్శనకు దిగడంతో పార్టీ క్యాడర్‌‌ టెన్షన్‌ పడుతోంది. స్థానిక నేతలు హనుమంతరెడ్డి, నవీన్ నిశ్చల్ గత ఎన్నికల్లో బాలకృష్ణకు అమ్ముడు పోయారని ఎమ్మెల్సీ ఘాటు వాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అవినీతి, అక్రమాలు నిరూపిస్తే, ఉరివేసుకుంటాడా ఊరు వదిలి వెళతాడా అంటు మరోవర్గం కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ హిందూపురం వైసీపీలో గొడవేంటి? రెండు వర్గాలుగా విడిపోయి ఎందుకు రోడ్డెక్కి పార్టీ పరువు బజారుకు ఈడుస్తున్నారు?

కొన్ని రోజుల కిందట హిందూపురంలో రచ్చ మొదలైంది. ఇక్బాల్ అహ్మద్ వద్దకు పనుల కోసం వెళ్లారట కొటిపి హనుమంత రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకున్న భూముల చదునుకు సంబంధించిన వర్కులు హనుమంత రెడ్డిని కాదని వేరే వారికి ఇవ్వడంపై రగడ మొదలైందట. పార్టీలో ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పనులు ఎలా ఇస్తారని ఇక్బాల్‌ను నిలదీశారట హనుమంతరెడ్డి. మాటామాటా కాస్త పెరిగి, భౌతిక ఘర్షణ సైతం జరిగిందట. పనులు అడిగితే ఎమ్మెల్సీ ఇక్బాల్ తనపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు హనుమంత రెడ్డి. ఈయనకు మద్దతుగా నవీన్ నిశ్ఛల్ వర్గం ఆసుపత్రిలో ఆందోళన చేపట్టింది. ఇక్బాల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మీడియా ముందుకు వచ్చి హనుమంతరెడ్డినే, తనతో గొడవకు దిగారని, తనకే గాయాలు అయ్యాయని అన్నారు. అంతేకాదు, పోటీగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ.

హనుమంత రెడ్డికి మద్దతుగా మరుసటి రోజు నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో స్థానిక నిజమైన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం పేరుతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. పోటీగా ఎమ్మెల్సీ వర్గం ఆందోళనకు దిగింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారే, అలాంటి చర్యలకు దిగుతున్నారని, లోకల్ లీడర్లపై నమ్మకం లేకనే, పార్టీ అధిష్టానం తనను ఇక్కడికి రప్పించిందని కౌంటర్ ఇచ్చారట ఎమ్మెల్సీ. ఇక్బాల్‌ మాటలకు నవీన్ నిశ్చల్ వర్గంలో కీలక నేత కొండూరు మండిపడ్డారు. ఎమ్మెల్సీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని అవి నిరూపిస్తే ఆయన ఉరి వేసుకుంటారా ఊరు విడిచివెళతారా అని సవాల్‌ విసురుతున్నారు. హిందూపురం వైసీపీలో ఇంత రచ్చ జరుగుతున్నా, పార్టీ అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలకూ దిగలేదని, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డెక్కడంపై తలలు పట్టుకుంటున్నారు. పార్టీ నేతలు జోక్యం చేసుకుని గొడవకు వెంటనే పుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు కార్యకర్తలు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories