స్టార్టప్స్ కోసం పుల్లెల గోపీచంద్ అకాడమి, ఎండియ పార్ట్‌నర్స్ కలిసి 'గేమ్ ఆన్' పేరుతో స్పోర్ట్స్ ఈవెంట్

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.

Update: 2025-05-01 09:54 GMT

గేమ్ ఆన్ లక్ష్యం ఏంటి?

క్రీడలు లేదా స్టార్టప్స్ రంగాల్లో కొన్ని రాజీపడలేని విషయాలు ఉంటాయి. అపజయాలను అధిగమించడం, సవాళ్లను దాటుకుని ముందుకు వెళ్లడం, మనమేంటో నిరూపించుకోవడం లాంటివి క్రీడల్లోనైనా లేదా స్టార్టప్స్‌లోనైనా చాలా అవసరం. కోర్టులో పోరాడి గోల్డ్ మెడల్ గెలిచేందుకైనా లేదా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికైనా ఇవి చాలా ముఖ్యం. ఒక జట్టులా కలిసి పనిచేయడం, నిరంతర కృషి, పట్టుదల, సవాళ్లను అధిగమించడం లాంటి అంశాలే జయాపజయాలను నిర్ణయిస్తాయి. అందుకే చాలామంది క్రీడాకారులు రిటైర్ అయిన తరువాత ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధిస్తున్నారు.

ఇదే విషయమై ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. క్రీడాకారులకు కోర్టులో ఉన్నప్పుడైనా లేదా వ్యాపారస్తులు బోర్డ్ రూమ్‌లో ఉన్నప్పుడైనా... సక్సెస్‌కు క్రమశిక్షణ, నిరంతరమైన కృషి, గొప్ప విషయాలను అలవర్చుకునే లక్షణాలు చాలా అవసరం. ఏదైనా సాధించగలం అని ఏ రోజుకు ఆ రోజు నిరూపించుకోగలగాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. అన్నింటికి మించి టీమ్‌పై నమ్మకం ఉండాలి. క్రీడల్లోనైనా, స్టార్టప్స్‌లోనైనా ఇవి తప్పనిసరి అని గుర్తించాలి అనేది పుల్లెల గోపీచంద్ అభిప్రాయం.

ఈ విషయాలనే దృష్టిలో పెట్టుకుని స్టార్టప్ సంస్థల ప్రయోజనం కోసం పుల్లెల గోపీచంద్ అకాడమి, ఎండియ పార్ట్‌నర్స్ భాగస్వామ్యంలో "గేమ్ ఆన్" అనే స్పోర్ట్స్ ఈవెంట్ లాంచ్ చేస్తున్నారు. కొత్తకొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ స్టార్టప్ వ్యాపారాలకు ఊతమిస్తున్న ఎండియ పార్ట్‌నర్స్ సంస్థతో కలిసి గోపీచంద్ ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఏం సాధించాలన్నా క్రీడాస్పూర్తి చాలా అవసరం అని చెబుతుంటారు కదా... అలాగే స్టార్టప్ సంస్థలు కూడా అదే స్పోర్టివ్ స్పిరిట్‌తో సక్సెస్ వైపు దూసుకెళ్లేలా గేమ్ ఆన్ అనే స్పోర్ట్ టోర్నమెంట్ డిజైన్ చేస్తున్నారు.

గేమ్ ఆన్ అనేది కేవలం క్రీడా పోటీలు మాత్రమే కాదు... ఫౌండర్స్‌కు రీచార్జ్ అనేది ఎంతో ముఖ్యం అని చెప్పడమే ఈ పోటీల ఉద్దేశం. మనల్ని మనం రీచార్జ్ చేసుకునేందుకు ఒక బ్రేక్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పైగా మరింత శక్తితో ముందుకెళ్లడంలో ఇది ఒక స్ట్రెంత్‌లా పనిచేస్తుందని చెప్పడమే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ గేమ్ ఆన్ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి టేబుల్ టెన్నిస్ మాజీ క్రీడాకారుడు, ఎండియ పార్ట్‌నర్స్ ఎండీ సతీష్ ఆండ్రా కూడా పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. స్టార్టప్ బిజినెస్‌లో ఆరంభంలో స్థిరత్వం అనేది చాలా అవసరం. పేరున్న క్రీడాకారుల ట్రైనింగ్ మైండ్‌సెట్ కూడా అలానే ఉంటుందని అన్నారు.

బెంగళూరులోని లక్ష్యన్ స్పోర్ట్స్ అకాడమీలో జూన్ 6, 7 తేదీలలో గేమ్ ఆన్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న స్టార్టప్ సంస్థలు నామమాత్రపు ఫీజు చెల్లించి ఈ పోటీల్లో పాల్గొంటాయి. స్టార్టప్ సంస్థలకు క్రీడలు చేరువయ్యేలా ఈ ఈవెంట్ రూపొందిస్తున్నాం. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్స్ క్రికెట్ ఆటల్లో పోటీలు జరగనున్నాయి. స్టార్టప్ బిజినెస్‌లకు అతి ముఖ్యమైన వేగంగా ఆలోచించడం, జట్టును సమన్వయం చేసుకోవడం, సవాళ్లను అధిగమించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు సతీష్ తెలిపారు. వ్యాపార రంగంలో అతి ముఖ్యమైన కమ్యునికేషన్, ఒత్తిళ్లను అధిగమించడం, క్లిష్ట సమయంలో టీమ్‌మేట్స్‌ను ఫౌండర్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారనే విషయాలు తెలుసుకునేందుకు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

బెంగళూరు తరువాత ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు ఈ గేమ్ ఆన్ స్పోర్ట్స్ ఈవెంట్‌ను విస్తరించనున్నారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్, చెన్నైలోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సతీష్ చెప్పారు.

సవాళ్లను ఛేదించేందుకు సరైన వేదిక

"స్టార్టప్ సంస్థలను స్థాపిస్తున్న వ్యవస్థాపకులు ఇటీవల కాలంలో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. నష్టాల కారణంగా ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొన్నిసార్లు అది వారి ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం చూపిస్తోంది. అది వారి జెనెటిక్స్ లేక మానసిక, శారీరక ఒత్తిళ్లు, లైఫ్‌... ఇలా కారణం ఏదైనా కావచ్చు... కానీ వ్యవస్థాపకులకు కూడా ఒక రీచార్జ్ అనేది ఎంతో అవసరం. ఆ దృక్పథంతోనే కల్ట్‌ ఫిట్, డార్విన్‌బాక్స్, ఈకిన్‌కేర్, షుగర్‌ఫిట్ లాంటి సంస్థల్లో ఎండియా పార్ట్‌నర్స్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. వ్యాపారంలో విజయం అంటే మూలధనం పెంచుకోవడం కాదు... అంతకుమించి ఫౌండర్స్ లైఫ్ బ్యాలెన్సింగ్‌గా ఉండటమే సుదీర్ఘమైన పెట్టుబడిగా భావిస్తాం" అని సతీష్ ఆండ్ర అభిప్రాయపడ్డారు.

స్టార్టప్ రంగంలో ఒక ప్రోడక్ట్‌ను లాంచ్ చేయడానికి ముందు దానిని ఎలాగైతే రెడీ చేస్తామో... మీ మనసు, శరీరాన్ని కూడా అలాగే ట్రైనప్ చేయాలి. క్రీడల్లో ఎలాగైతే కొన్నిసార్లు గెలవడం, ఇంకొన్నిసార్లు ఓడిపోవడం జరుగుతుందో... స్టార్టప్ బిజినెస్‌లోనూ అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎటొచ్చీ గెలిచామా, లేక ఓడామా అనేది ముఖ్యం కాదు... ఏ రోజుకు ఆ రోజు సవాళ్లను అధిగమిస్తూ ఎలా ముందుకెళ్తున్నామనేదే చాలా ముఖ్యం అనేది సతీష్ అభిప్రాయం.

గోపీచంద్ కూడా సతీష్ అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రతీరోజు అంకుఠిత దీక్షతో కృషి చేస్తే ఆటల్లోనైనా, స్టార్టప్‌లోనైనా విజయం మీదే అవుతుందన్నారు. అది బలమైన జట్లను, నాయకులను తయారు చేయడానికి బాటలు వేస్తుందన్నారు. సవాళ్లను అధిగమించడానికి తను యోగా చేస్తానని అన్నారు. యోగా తనకు తిరిగి ఎనర్జీని ఇవ్వడంతో పాటు పనిపై ఏకాగ్రతను పెంచుతుందన్నారు. స్టార్టప్స్ రంగంలో నేటి యువతరం ఎనర్జీ చూస్తోంటే ముచ్చటేస్తోందని తెలిపారు. వైఫల్యాల నుండి తిరిగి పుంజుకోవడాన్ని, బాగా పర్‌ఫార్మ్ చేయడాన్ని వేర్వేరుగా చూడలేమన్ని చెబుతూ స్టార్టప్ ఫౌండర్స్ కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నిత్యం వ్యాపార ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఎంటర్ ప్రెన్యువర్స్‌కు 'గేమ్ ఆన్' లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ మంచి ఎనర్జీ బూస్టర్స్ అన్నారు. తమలో తాము చూసుకోవడంతో పాటు జట్టుతో కలిసి పనిచేయడంలో ఇలాంటి క్రీడలు ఎంతో హెల్ప్ అవుతాయని గోపీచంద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News