Telangana Budget : నేడే తెలంగాణ బడ్జెట్ 2026-27.. సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చిన రేవంత్ సర్కార్

Telangana Budget : నేడు తెలంగాణ అసెంబ్లీలో రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమానికి రూ.లక్ష కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.

Update: 2026-03-20 02:35 GMT

 Telangana Budget

Telangana Budget : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే కీలక ఘట్టం ఆసన్నమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ భారీ పద్దును సిద్ధం చేసింది. రేవతి నక్షత్రం, అభిజిత్ లగ్నం వంటి శుభ ముహూర్తాల మధ్య ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికంటే ముందు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతులకు ఆమోదం తెలపనుంది. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ పరిమాణం సుమారు రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గతేడాదితో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అదనపు పెరుగుదల.

సంక్షేమానికి రూ.లక్ష కోట్లు

ప్రభుత్వం ఈసారి సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. సుమారు రూ.లక్ష కోట్లకు పైగా నిధులు వివిధ సంక్షేమ పథకాలకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ రూ. 29 వేల కోట్లు కోరగా, ప్రభుత్వం రూ.17 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లకు కరెంటు సరఫరా కోసం డిస్కంలు రూ. 20 వేల కోట్లు అడగగా, గతంలో కంటే ఎక్కువ నిధులను ఈ పద్దు కింద కేటాయించనున్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులు, సాగునీరు

రాష్ట్రంలో మూలధన వ్యయం (అభివృద్ధి పనుల ఖర్చు) కూడా ఈసారి భారీగా పెరగనుంది. గత బడ్జెట్‌లో రూ.36,504 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.45 వేల కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యంగ్ ఇండియా స్కూల్స్, కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సాగునీటి శాఖకు రూ.26 వేల కోట్లు కేటాయించినప్పటికీ, అందులో సగం కంటే ఎక్కువ మొత్తం పాత అప్పుల కిస్తీలు కట్టడానికే సరిపోతుందని అంచనా.

రైతు భరోసా, ఉద్యోగుల సమస్యలు

రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు సుమారు రూ.20 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు, కొత్త ఉద్యోగాల భర్తీ వల్ల జీతభత్యాల పద్దు రూ.46 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం రూ.10 వేల కోట్లు, పెండింగ్ బిల్లుల కోసం మరో రూ.10 కోట్లు అవసరమని ఉద్యోగ సంఘాలు కోరుతుండటంతో, ప్రభుత్వం ఈ విభాగంలో కేటాయింపులు ఎలా చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పింఛన్ల కోసం సుమారు రూ.16 వేల కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది.

అప్పులు, వడ్డీల భారం

రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల భారం ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది కొత్తగా రూ.70 వేల కోట్ల వరకు అప్పులు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తీసుకుంటున్న కొత్త అప్పుల్లో 70 శాతం పాత బాకీలు తీర్చడానికే వెళ్లడం గమనార్హం. అయినప్పటికీ, ఆదాయ వనరులను పెంచుకుంటూ సంక్షేమాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

Tags:    

Similar News