Telangana Assembly : బడ్జెట్‌పై వాడివేడి చర్చ.. సభను ముట్టడించేందుకు బీజేపీ 'చలో అసెంబ్లీ' పిలుపు

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నేడు కీలక బిల్లులపై చర్చించనుంది. ఆరు గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు బిల్లు, బీజేపీ చలో అసెంబ్లీ పిలుపుతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Update: 2026-03-23 02:32 GMT

Telangana Assembly

 Telangana Assembly : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేడు (మార్చి 23, 2026) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా, అటు విపక్షాలు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్‌తో వస్తున్నాయి. సభ లోపల రాజకీయ యుద్ధం, సభ బయట నిరసనలతో నేడు భాగ్యనగరం వేడెక్కనుంది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (రద్దు) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా వైద్య వ్యవస్థలో పాలనాపరమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ప్రభుత్వ సర్వీసులలో నియామకాల క్రమబద్ధీకరణ, వేతన నిర్మాణ హేతుబద్ధీకరణకు సంబంధించిన మూడవ సవరణ బిల్లును కూడా మంత్రులు సభలో ప్రతిపాదిస్తారు. వీటిపై ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ జరిగే అవకాశం ఉంది.

మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల నుంచి భూ రికార్డుల వరకు..

శాసనసభలో నేడు పలు ప్రజా సమస్యలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఎప్పుడు స్మార్ట్ కార్డులు ఇస్తారనే అంశంపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. వీటితో పాటు ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు, వేతన సవరణ కమిషన్ తాజా పరిస్థితి, గిగ్ వర్కర్ల సంక్షేమం, ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సఫారీ ఏర్పాటు, రాష్ట్రంలో యూరియా కొరతపై కూడా విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి.

మండలిలో చర్చకు రానున్న అంశాలు

శాసన మండలిలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేట్ మెడికల్ షాపుల నిర్వహణ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఐటీ ఉద్యోగాల కల్పన, కొత్త పరిశ్రమల స్థాపనపై సభ్యులు సమాధానాలు కోరనున్నారు. అలాగే, గ్రామ పాలన అధికారుల సమస్యలు, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లు, అండర్ పాస్ ల నిర్మాణంపై కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనితీరును సమీక్షించనున్నారు.

గ్యారంటీలపై విపక్షాల పొలిటికల్ యుద్ధం

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సమరానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ తరపున ప్రైవేటు మెంబర్ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మరోవైపు, బీజేపీ రేపు చలో అసెంబ్లీ పేరిట భారీ నిరసనకు పిలుపునిచ్చింది. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారంటూ అసెంబ్లీని ముట్టడించేందుకు కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో భాగ్యనగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags:    

Similar News