Kondagattu: హనుమాన్ జయంతి వేళ అపశృతి.. కూలిన చలవ పందిరి!
Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చలవ పందిరి కూలి భక్తులు గాయపడటంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు.
Kondagattu: హనుమాన్ జయంతి వేళ అపశృతి.. కూలిన చలవ పందిరి!
Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదం కలకలం రేపుతోంది. కేశఖండనం నిర్వహిస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలవ పందిరి కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండగట్టు ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిత్యం వేలాది మంది, ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర స్థలంలో కనీస మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షణ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల కలెక్టర్ పర్యటన కూడా సరైన విధంగా జరగలేదని విమర్శించారు. ఇకనైనా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.