Peddapalli: కాషాయం - టోపీ ఒక్కటయ్యాయి.. స్నేహానికి అడ్డు రాని మతాలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. అంజన్న మాలధారి వినోద్, తన ముస్లిం స్నేహితుడు కరిముల్లాకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
Peddapalli: కాషాయం - టోపీ ఒక్కటయ్యాయి.. స్నేహానికి అడ్డు రాని మతాలు!
కాల్వ శ్రీరాంపూర్: కులాలు, మతాల కంటే మానవత్వం, స్నేహబంధం మిన్న అని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు నిరూపించారు. పవిత్ర రంజాన్ పర్వదినం వేళ ఇక్కడ ఆవిష్కృతమైన ఒక దృశ్యం స్థానికుల మనసు గెలుచుకుంది.
భక్తివేళ.. స్నేహ సంబరం:
స్థానిక యువకుడు చెప్పాలా వినోద్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్నారు. కాషాయ వస్త్రాలు ధరించి అంజన్న మాలధారిగా ఉన్న వినోద్, తన ప్రాణ స్నేహితుడు ఎండి కరిముల్లాను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన కరిముల్లాను, వినోద్ ఆత్మీయంగా ఆలింగనం (అలై-బలై) చేసుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
వెల్లివిరిసిన సోదరభావం:
ఒకవైపు రామ నామ స్మరణలో ఉన్న మాలధారి, మరోవైపు అల్లాహ్ ప్రార్థనలు ముగించుకున్న ముస్లిం యువకుడు.. ఇలా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ ఘటన నిదర్శనమని, నేటి సమాజానికి ఇలాంటి స్నేహబంధాలే స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.