Telangana: ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు పెరిగిన గిరాకీ
Telangana: ప్రైవేట్ సెంటర్‌లో 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్
ప్రైవేట్ వాక్సినేషన్ సెంటర్ (ఫైల్ ఇమేజ్)
Telangana: తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ అస్త్రం.. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్నే ఇస్తోందని చెప్పుకోవచ్చు. కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించి.. టీకా ప్రక్రియ చేపడుతోంది ప్రభుత్వం.
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల పంపిణీ జోరు పెరిగింది. కరోనాను అంతమొందించాలంటే టీకా వేయించుకోవాల్సిందేనన్న వైద్య నిపుణుల సూచన, కొద్దినెలల్లో థర్డ్‌వేవ్ ముప్పు పొంచిఉందనే అంచనాల నేపథ్యంలో.. టీకాలకు డిమాండ్ పెరిగింది. పెద్దసంఖ్యలో జనం వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కొన్ని కేటగిరీలవారికే వ్యాక్సిన్లు వేస్తుండటంతో జనం.. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణలో 656 ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు 29 ప్రైవేటు కోవిడ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లతో పాటు హైరిస్క్ కేటగిరీలో ఉన్న వారికి, 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల పంపిణీ ఉచితం కాగా.. ప్రైవేటు కేంద్రాల్లో మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారం రోజుల నుంచి టీకాల పంపిణీ జోరందుకుంది. 29 కోవిడ్ ప్రైవేట్ కేంద్రాల్లో.. రోజుకు సగటున 2వేల మందికిపైనే టీకాలు ఇస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల విషయానికొస్తే.. రోజుకు సగటున 2 వందల కంటే తక్కువ మందికి టీకాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 73 లక్షల 99 వేల 241 టీకాలు ఇవ్వగా.. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో ఇచ్చినవి 60 లక్షల 71 వేల 872, ప్రైవేటు కేంద్రాల్లో ఫీజులు చెల్లించి తీసుకున్నవి 13 లక్షల 27 వేల 369 డోసులుగా ఉన్నాయి.