CM Revanth Reddy: చలాన్ పడగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ ..!
Traffic Challan : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Reddy: చలాన్ పడగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ ..!
Traffic Challan : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా పోలీసు శాఖ పక్కా నివేదిక రూపొందించి అమలు చేయాలని, ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడమే మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిమానాల వసూలుకు వాహనాల నంబర్ ప్లేట్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు జీడీపీకే దెబ్బ
సీఎం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీని వల్ల దేశ జీడీపీలో దాదాపు 3 శాతం నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఈ ప్రమాదాలను కచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కేవలం పోలీసు, రవాణా శాఖలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చలాన్ పడగానే డబ్బు కట్ అయ్యే విధానం అమలులోకి రావాలి అని అభిప్రాయపడ్డారు.
ట్రాఫిక్ చలాన్లకు ఇక రాయితీలు లేవు
ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇకపై ఎలాంటి రాయితీలు, తగ్గింపులు ఉండవని సీఎం తేల్చిచెప్పారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. పెండింగ్ చలాన్లు వెంటనే వసూలయ్యే విధానం ఉండాలని స్పష్టం చేశారు.
విద్యార్థి దశ నుంచే అవగాహన
దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని సీఎం తెలిపారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సైబర్ క్రైమ్, డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ టాప్
మారుతున్న పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, అయితే వాటి నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. డ్రగ్స్ నియంత్రణలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.
అయితే సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులకంటే రోడ్డు ప్రమాదాలే అత్యంత తీవ్రమైన సమస్యగా మారాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
చెరువుల పునరుద్ధరణకు హైడ్రా
జంట నగరాలు, శివార్లలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. హైడ్రా ఏర్పాటుతో అనేక చెరువులకు మళ్లీ జలకళ వచ్చిందని, భూగర్భ జలాల స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విభాగాన్ని స్వచ్ఛందంగా ఆదరిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమ వివరాలు
ఈ సందర్భంగా సీఎం ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్, థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి, సిటీ కొత్వాల్ సజ్జనార్‌తో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా మలిచారు.